శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రోజుకు సగటున 15 టీఎంసీలకు పైగా వరదనీరు డ్యాంకు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి మంగళవారం సాయంత్రం సమయానికి 2,48,148 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదలవుతుంది. విద్యుత్ ఉత్పాదన అనంతరం 26,817 క్యూసెక్కులు, స్పిల్‌వే ద్వారా 2,21,331 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీరు విడుదలయ్యింది. జలాశయం పరిసర ప్రాంతాలలో 2.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుతం జలాశయంలో 108.4880 టీఎంసీల నీటి నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 860.80 అడుగులకు చేరుకుంది.
హొళగుంద: కర్ణాటక రాష్ట్రం హోస్పేట్ వద్ద నిర్మించిన ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయానికి మంగళవారం భారీ ఎత్తున వరద పోటెత్తింది. సోమవారం ఉదయం డ్యాంలో 44.190 టీఎంసీల నీరు నిల్వ ఉండి ఇన్‌ఫ్లో 90 వేల క్యూసెక్కుల వరకు రావడంతో మంగళవారం ఉదయం నాటికి 51.145 టీఎంసీల నీరు నిల్వ అయ్యాయి. ఒక్క రోజులోనే 7 టీఎంసీల మేర నీరు వచ్చి చేరింది. సాయంత్రం నాటికి ఇన్‌ఫ్లో లక్ష క్యూసెక్కులకు చేరడంతో బుధవారం ఉదయం నాటికి 60 టీఎంసీల (పూర్తి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు) నీరు నిల్వ కానున్నాయి. నీటిమట్టం1633 అడుగులకు గాను 1620 అడుగులకు చేరింది. డ్యాం ఎగువన నిర్మించిన గాజనూరు జలాశయం(అప్పర్ తుంగా) పైభాగంలోని శివమొగ్గ, తీర్థనహళ్లి, శృంగేరి, వరనాడు, మలెనాడు, కొప్ప ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా తుంగభద్ర రిజర్వయర్‌కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. వర్షాలు ఇదే విధంగా ఉంటే వారం పది రోజులో డ్యాం నిండే అవకాశాలున్నాయి.
కర్నూలు కల్చరల్: పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఏపీటీడీసీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ యాదవ్ పేర్కొన్నారు. కర్నూలు వెంకటరమణ కాలనీలోని ఏపీటీడీసీ హరిత యూనిట్‌ను మంగళవారం రాత్రి ఆయన ఆకస్మికంగా సందర్శించి, వసతి గదులు, రెస్టారెంట్‌తో పాటు యూనిట్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అతిథులకు అందిస్తున్న సేవలు, నిర్వహణ, పరిశుభ్రత, వసతి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అహోబిలం హరిత యూనిట్‌లో ల్యాండ్ స్కేపింగ్ పనులను తక్షణమే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మహానంది హరిత యూనిట్ అభివృద్ధి కోసం సమగ్ర పునరుద్ధరణ ప్రతిపాదనలను సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని ఎస్‌ఈకి సూచించారు. ఏపీటీడీసీ డీఎం జి.లక్ష్మినారాయణ, యూనిట్ మేనేజర్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


