పత్తికొండ రూరల్: మండల పరిధిలోని హోసూరు గ్రామానికి చెందిన మాల రవి (30) మంగళవారం పాముకాటుకు గురై మృతి చెందాడు. రంగన్న, రామాంజినమ్మల కుమారుడైన రవి కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. నెల రోజుల క్రిందట దేవనకొండకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆషాఢ మాసం కావడంతో ఆమె పుట్టింటికి పోగా, భార్యను పలకరించేందుకు వెళ్లి అక్కడ పడుకుని ఉండగా పాముకాటుకు గురై అపస్మారక స్థితిలో పడిపోగా చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పెళ్‌లైన నెల రోజులకే మృత్యుఒడికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని బెలుం శింగవరంలో విద్యుదాఘాతంతో మోటార్ మెకానిక్ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న తాగునీటి బోరుకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సరిచేసేందుకు మెకానిక్ కంబయ్య (45) అక్కడున్న స్తంభాన్ని ఎక్కాడు. ఆ సమయంలో తీగ తెగి స్తంభంపైనున్న కాసారంపై పడటంతో విద్యుత్ షాక్‌కు గురై పైనుంచి కింద పడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నగీనా ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడు కంబయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను బెంగళూరులోని ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమానికి వచ్చిన జపాన్ దేశానికి చెందిన బుద్ధిష్ట్ మాంక్స్ ఇటో మిచ్చికో, ఆమె కుమార్తె ఇటో జెన్సివో దర్శించుకొని, స్వామి అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం వీరు గంటా మఠం ఆలయాన్ని దర్శించి బిల్వం మొక్కలను నాటారు.


