కొండమల్లేపల్లి : పెండ్లిపాకల జలాశయం సామర్థ్యం పెంపు వల్ల ముంపునకు గురవుతున్న మండలంలోని గుడితండాకు చెందిన సుమారు 404 కుటుంబాల వారు నిరాశ్రయులవుతున్నారు. ఈ క్రమంలో ఇళ్లను ఖాళీ చేయాలని, అందుకు ప్రభుత్వం నుంచి మంజూరైన నగదు చెల్లింపుల కోసం మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా నుంచి వచ్చిన అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసు పత్రంపై తేదీ జూలై 31, 2026 అని ఉండడంతో పాటు ఏడు రోజుల్లోపు మాత్రమే అభ్యంతరాలు తెలుపుకునే వీలుండడంతో.. ఆగస్టు 11 తేదీతో నోటీసులు జారీ చేయాలని తండావాసులు పలువురు అధికారులను కోరారు. అలా కుదరదని మీరు సంతకం చేసేచోట ఆగస్టు 11, 2026 అని రాసుకొమ్మని సూచించడంతో అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తమకు ఇష్టం లేని చోట పునరావాసం కల్పించడం సరికాదని, తాము గిరిజనులమని అధికారులు తమపై చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లీలావతిని వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనల మేరకు తాము వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
నేడు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాక
నల్లగొండ : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ బుధవారం నల్లగొండకు రానున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు ఈనెల 12న మధ్యాహ్నం 3 గంటలకు నల్లగొండలోని కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్‌లో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, ఎస్సీ ఎస్టీలపై దాడులు, ఉద్యోగాల్లో రోస్టర్ పాయింట్ అమలు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అమలు, తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు.


