
వయోవృద్ధుల సంక్షేమానికి అనేక చట్టాలు
రామగిరి(నల్లగొండ) : వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయ వ్యవస్థలో అనేక చట్టాలు ఉన్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా సదన్‌లో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వయోవృద్ధుల సంరక్షణకు న్యాయ వ్యవస్థ కృషి చేస్తుందన్నారు.అనంతరం సీనియర్ సిటిజన్స్‌ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ పురుషోత్తమరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్, మహిళా కోర్టు జడ్జి కవిత, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, చీఫ్ లీగల్ ఎయిర్ కౌన్సిల్ సభ్యుడు ఎన్.బీమార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏటీసీ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ), ఐటీఐలో యువతకు ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ ఇస్తామని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా 6 కోర్సులు ప్రవేశపెట్టామని.. ప్రస్తుతం ఉన్న పరిశ్రమల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఆధారంగా ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి దేశీయంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. నల్లగొండలోని ప్రభుత్వ పాత ఐటీఐ, కొత్త ఐటీఐ, అనుముల, డిండి ఐటీఐలలో రోజూ ఉదయం 12 గంటలలోపు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్నవారు పదో తరగతి మెమో, ఆధార్‌కార్డు, బోనఫైడ్, టీసీ, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.
వృద్ధులు, వికలాంగులు, బాలికలతో కొత్త సంఘాలు
నల్లగొండ : సెర్ప్ ద్వారా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే కార్యక్రమంలో భాగంగా కొత్త మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 ఏళ్లు పైబడిన మహిళలు 10 నుంచి 15 మందిని కలిపి ఒక సంఘంగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వికలాంగులకు ప్రత్యేకంగా, 13 నుంచి 15 ఏళ్ల వయస్సు వరకు, 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు కలిగిన కిషోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
భక్తిశ్రద్ధలతో తీజ్ వేడుకలు
కొండమల్లేపల్లి : మండలంలోని గౌరికుంటతండాలో తీజ్ వేడుకలను గురువారం గిరిజనులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు పూజలు చేసిన మొలకల బుట్టలను యువతులు తలపై ఎత్తుకొని గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మొలకల బుట్టలను చెరువులో వదిలారు. వేడుకల్లో గ్రామపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
డైరెక్ట్ ఏజెంట్ల
నియామకానికి దరఖాస్తులు
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పోస్టల్ డివిజన్ పరిధిలో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్‌ఐ), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్‌పీఎల్‌ఐ) డైరెక్ట్ ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత అర్హత కలిగి మార్కెటింగ్, సేల్స్, ఫైనాన్షియల్ అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ బయోడేటా, వయస్సు ధ్రువీకరణ పత్రం, విద్యార్హత సర్టిఫికెట్, గుర్తింపు పత్రాల ప్రతులు జతచేసిన దరఖాస్తును నల్లగొండ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ డివిజన్ కార్యాలయంలో ఈ నెల 28వ తేదీ లోపు సమర్పించాలని సూచించారు.

వయోవృద్ధుల సంక్షేమానికి అనేక చట్టాలు