
జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక
మునగాల: మునగాల మండలం ఆకుపాముల గ్రామానికి చెందిన పోలంపల్లి సురేష్‌గౌడ్, సుజాత దంపతుల కుమారుడు వసంత్‌గౌడ్ జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. వసంత్‌గౌడ్ నల్లగొండ జిల్లా పెదవూర మండలం చలకుర్తి గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల ఏపీలోని ఏలూరులో జరిగిన అండర్–14 హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాసమితి క్రికెట్ సెలక్షన్స్‌లో వసంత్‌గౌడ్ పాల్గొని 15రోజుల రీజినల్ క్రికెట్ శిబిరానికి ఎంపికయ్యాడు.
ఈ శిబిరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఈ నెల చివరి వారంలో హర్యానా రాష్ట్రంలో జరగనున్న నవోదయ క్రీడా సమితి జాతీయ స్థాయి అండర్–14 క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. తన తండ్రి సురేష్‌గౌడ్, కోదాడ క్రికెట్ అకాడమీ కోచ్ షేక్ సిద్ధిక్ ప్రోత్సాహం, ఎస్‌వీఎస్ పాఠశాల, నల్లగొండ యాజమాన్యం సహకారంతో జాతీయ స్థాయికి ఎంపికై నట్లు వసంత్‌గౌడ్ పేర్కొన్నాడు. వసంత్‌గౌడ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలంపల్లి సుధాకర్‌గౌడ్ ఆకాంక్షించారు.
ఎంజీయూలో అధ్యాపకులకు శిక్షణ
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అధ్యాపకుల నైపుణ్యాలను పెంపొందించేందుకు గురువారం యూనివర్సిటీలో ఇన్ల్పిప్ నెట్ సంస్థ ప్రతినిధి అర్షద్‌ఖాన్ శిక్షణ ఇచ్చారు. లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టంపై ఆన్‌లైన్ కోర్సులు రూపొందించుట, విద్యా సంబంధిత విషయాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచే విధానాలు, పరిశోధనలు, వాటి ప్రచురణలు తదితర అంశాలపై ఆన్‌లైన్ ద్వారా అవగాహన కల్పించారు. ఇన్ల్పిప్ నెట్‌లో విశ్వవాప్తంగా జరిగే అధునాతన పరిశోధనలు అందుబాటులోకి రావడం వలన అధ్యాపకులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ విద్యార్థులకు బోధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అలువాల రవి, మిర్యాల రమేష్, శ్వేత, శ్రీలక్ష్మి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
వాగులో కొట్టుకుపోయి రైతు మృతి
నిడమనూరు: పొలానికి వెళ్తూ వాగులో కొట్టుకుపోయి రైతు మృతిచెందాడు. ఈ ఘటన నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరేపల్లి గ్రామానికి చెందిన ఆవుల రాంమూర్తి(55) మంగళవారం సాయంత్రం తన వ్యవసాయ పొలానికి వెళ్తూ మార్గమధ్యలో హాలియా వాగులో కొట్టుకుపోయాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతడి ఆచూకీ కోసం గాలిస్తుండగా.. గురువారం వాగు వెంట చెట్ల పొదల్లో రాంమూర్తి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
గుండెపోటుతో జూనియర్ అసిస్టెంట్ మృతి
గరిడేపల్లి: గరిడేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ జియావుద్దీన్(55) గురువారం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో మృతిచెందారు. ఆయన స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి కాగా.. అక్కడి నుంచి ఆయన బదిలీపై గరిడేపల్లికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ గత మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. జియావుద్దీన్ మృతి పట్ల పాఠశాల సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.

ఎంజీయూలో అధ్యాపకులకు శిక్షణ