వచ్చే నెలలో చేనేత రుణమాఫీ | - | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో చేనేత రుణమాఫీ

Aug 22 2025 6:30 AM | Updated on Aug 22 2025 6:30 AM

వచ్చే నెలలో చేనేత రుణమాఫీ

వచ్చే నెలలో చేనేత రుణమాఫీ

పోచంపల్లిలో ఉత్సవాలు

నిర్వహించాలని వినతి

భూదాన్‌పోచంపల్లి: లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాగానే వచ్చే నెలలో చేనేత కార్మికుల ఖాతాల్లో చేనేత రుణమాఫీ డబ్బులు జమవుతాయని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ తెలిపారు. భూదాన్‌పోచంపల్లిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాస్టర్‌ వీవర్‌, నేషనల్‌ మెరిట్‌ అవార్డు గ్రహీత తడక రమేశ్‌ ఏర్పాటుచేసిన పోచంపల్లి ప్రొడ్యూసర్‌ కంపెనీ షోరూంను వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ రీజినల్‌ డైరెక్టర్‌ అరుణ్‌కుమార్‌తో కలిసి గురువారం ఆమె ప్రారంభించారు. అనంతరం శైలజా రామయ్యర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం చేనేత రుణమాఫీ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, కొన్ని జిల్లాల్లో జిల్లాస్థాయి బ్యాంకర్ల తీర్మానాలు పూర్తి కాలేదన్నారు. జిల్లాల వారీగా వచ్చిన బ్యాంకర్ల తీర్మానాలు రాష్ట్రస్థాయిలో పూర్తిచేసి రుణమాఫీ చేస్తామని చెప్పారు. త్రిఫ్ట్‌ పథకంలో కొత్త పేర్లు మార్పులు, చేర్పులతో కాస్త ఆలస్యమైందని, జూన్‌ నెలకు సంబంధించి రూ.7 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. టెస్కో కొనుగోలు చేసిన పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్కులో నెల రోజుల్లో నేచురల్‌ డై యూనిట్‌ను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. పర్యావరణహితమైన నేచురల్‌ డై విధానం అందుబాటులోకి వస్తే పోచంపల్లి ఇక్కత్‌కు మరింత గుర్తింపువస్తుందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఐఐహెచ్‌టీని పోచంపల్లిలోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారని, శిథిలావస్థకు చేరిన హ్యాండ్లూమ్‌ పార్కును పునర్నిర్మించి వచ్చే రెండేళ్లలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీని ఇక్కడే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఐఐహెచ్‌టీని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోచంపల్లి ప్రొడ్యూసర్‌ కంపెనీ తెలంగాణలోనే మొదటి పైలెట్‌ ప్రాజెక్ట్‌ అని అన్నారు. చేనేత వస్త్రోత్పత్తులు, ఉపాధి, మార్కెటింగ్‌ అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రొడ్యూసర్‌ కంపెనీలను ప్రోత్సహిస్తోందని అన్నారు. షోరూమ్‌లో తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్‌, గద్వాల, సిద్దిపేట గొల్లభామ వస్త్రాలతో పాటు దేశంలో పేరెన్నికగన్న అనేక వస్త్రాల వైరెటీలను అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా డూప్లికేట్‌ చేనేత వస్త్రాలను అరికట్టేందుకు తెలంగాణ అథెంటిక్‌ లోగోలను అందజేస్తుందని, ఈ లోగోలను అతికించడం ద్వారా చేనేత వస్త్రాల నాణ్యత, వినియోగదారులకు నమ్మకం పెరిగి కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందన్నారు.

62 మంది అవార్డు గ్రహీతలకు

పింఛన్లు మంజూరు..

65 సంవత్సరాలు దాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతలకు నెలకు రూ.8వేలు పింఛన్‌ ఇస్తున్నామని, ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి 62 మందికి పింఛన్‌ మంజూరైందని వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ రీజినల్‌ డైరెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు. అవార్డు గ్రహీతల పిల్లలు హ్యాండ్లూమ్‌కు సంబంధించి కోర్సులు అభ్యసిస్తే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు నెలకు రూ.5వేల స్కాలర్‌షిప్‌ను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. అంతేకాక 90శాతం సబ్సిడీతో ఎలక్ట్రానిక్‌ జకాట్‌ మిషన్లు, మగ్గాలు, ఆసు యంత్రాలు, హ్యాండ్లూమ్‌ ఎక్విప్‌మెంట్స్‌ అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతమైతే రాష్ట్రంలో మరో 42 షోరూలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖతతో ఉందని తెలిపారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రొడ్యూసర్‌ కంపెనీ ద్వారా 12మంది చేనేత కళాకారులను విదేశాలకు పంపించి అక్కడ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి మార్కెటింగ్‌ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. కొత్తగా బున్‌కర్‌ దీదీ పథకం కింద మహిళా చేనేత కార్మికులకు ముద్ర రుణాలు ఇప్పించడంతో పాటు వారికి నూలు అందించడం, మార్కెటింగ్‌ సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. చేనేత కార్మికుల వార్షిక ఆదాయం రూ.10లక్షలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద తెలంగాణను ఎంపిక చేయగా.. అందులో ఉమ్మడి జిల్లాను ఎంపిక చేశామని త్వరలో ఆ పథకాన్ని అమలు చేయనున్నామని వెల్లడించారు.

యునెస్కో చేత అంతర్జాతీయ అవార్డు పొందిన పోచంపల్లిలో ఉత్సవాలను నిర్వహించాలని, పోచంపల్లిలో నూలు డిపో ఏర్పాటు చేసి కేంద్రం ఇచ్చే సబ్సిడీని అమలు చేయాలని పోచంపల్లికి చెందిన చేనేత నాయకులు తడక వెంకటేశం తదితరులు ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఉత్సవాల డీపీఆర్‌ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాస్‌రావు, చౌటుప్పల్‌ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, డీఓ రాజేశ్వర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్‌

సెక్రటరీ శైలజా రామయ్యర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement