
యూరియా కష్టాలు
నిరాశతో వెనుదిరిగిన రైతులు
కొత్తపల్లిలో ఒక్కో రైతుకు మూడు బస్తాలే..
హాలియా : హాలియా మండలంలోని కొత్తపల్లి వ్యవసాయ సహకార సంఘానికి గురువారం 20 మెట్రిక్ టన్నుల (444 బస్తాలు) యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు, మహిళలు, చిన్నారులు గురువారం ఉదయం నుంచే పీఏసీఎస్ వద్ద ఎగబడ్డారు. ఎక్కువ మంది రైతులు రావడంతో పీఏసీఎస్ సిబ్బంది.. ఏడీఏ సరిత, సీఐ సతీష్‌రెడ్డికి సమాచారం అందించారు. సీఐ సతీష్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులను వరుసలో నిలబెట్టి టోకెన్ల ప్రకారం పంపారు. యూరియా తక్కువగా ఉండడంతో ఒక్కో రైతుకు కేవలం మూడు బస్తాలు మాత్రమే ఇచ్చారు. అయినా సరిపోకపోవడంతో చాలా మంది రైతులు నిరుత్సాహంతో వెనుదిరిగారు.
తాటికల్ గోదాం వద్ద బారులు
నకిరేకల్ : నకిరేకల్‌లోని తాటికల్ పీఎసీఎస్ గోదాం ముందు గురువారం రైతులు, మహిళలు ఉదయం నుంచే బారులుదీరారు. 330 బస్తాల యూరియా నిల్వ ఉండడంతో పీఎసీఎస్ సిబ్బంది పోలీసుల సహకారంతో రైతులకు యూరియా అందించారు. ఒక్కో రైతులకు మూడు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో కేవలం 110 మంది రైతులకు పరిపోయింది. దీంతో మరో 200 మంది రైతులు గోదాం వద్ద ఆందోళనకు దిగారు. మరో రెండు రోజుల్లో 15 టన్నుల యూరియా వస్తుందని.. రైతులకు పూర్తిస్థాయిలో అందిస్తామని పీఏసీఎస్ సిబ్బంది హమీ ఇవ్వడంలో రైతులు వెనుదిరిగారు.
నార్కట్‌పల్లిలో ఆందోళన
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి పీఏసీఎస్‌కు గురువారం యూరియా వచ్చింది. కానీ రైతులకు ఇవ్వలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు సీఏసీఎస్ ఎదుట ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పడంతో ఆందోళన సద్దు మనిగింది.
కట్టంగూర్ : కట్టంగూర్ పీఏసీఎస్ గోదాముకు గురువారం ఉదయం 11 గంటలకు గోదాముకు 333 యురియా వచ్చింది. అప్పటికే రైతులు ఆధార్‌కార్డులు, పాస్‌బుక్‌లను క్యూలో ఉంచారు. పీఏసీఎస్ సిబ్బంది, ఏఓ గిరిప్రసాద్ పోలీసుల సహకారంతో రైతుకు ఒక్క బస్తా చొప్పున యూరియా పంపిణీ చేశారు. 200 మందికి పైగా రైతులు యూరియా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగిగారు. రెండు వారాల్లో 600 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని ఏఓ తెలిపారు.
ఫ వరి, పత్తి పంటలకు ఒకేసారి అవసరం
ఫ యూరియా కోసం పీఏసీఎస్‌ల వద్ద రైతుల బారులు
ఫ అరకొర సరఫరాతో తప్పని ఇబ్బందులు
ఫ ఒక్కోచోట రైతుకు మూడు బస్తాల చొప్పున పంపిణీ
ఫ క్యూలో ఉన్నా యూరియా అందక నిరాశతో వెనుదిరిగిన కొందరు రైతులు
సాగు పనులు ఊపందున్న వేళ అన్నదాతలకు ఎరువుల కష్టాలు తప్పడం లేదు. సరిపడా యూరియా నిల్వలు లేక రైతాంగం అష్టకష్టాలు పడుతోంది. వారం రోజులుగా అడపాదడపా వర్షాలు కురవడం, కాల్వల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తుండడంతో సాగు పనులు ఊపందుకున్నాయి. దీంతో వరి, పత్తి సాగు చేసే రైతులకు ఒకేసారి యూరియా అవసరం ఏర్పడింది. కానీ రైతుల అవసరాలకు సరిపడా యూరియా సరఫరా లేకపోడంతో రైతులు తాము సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క బస్తా దొరికినా చాలు అన్న విధంగా రైతులు రోజుల తరబడి పీఏసీఎస్‌ల ఎదుట నిరీక్షిస్తున్నారు. గురువారం జిల్లాలోని పలు పీఏసీఎస్‌ల వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు. గంటల కొద్దీ వేచి ఉన్నా కొందరికి యూరియా అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు.

యూరియా కష్టాలు