
కొత్తకార్డులకూ సన్నబియ్యం
అందనున్న పథకాలు
నల్లగొండ : రేషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారి కల నెరవేరనుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సన్న బియ్యం అందజేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అయితే ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన వారికి కూడా రేషన్ బియ్యం అందించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. కొత్తగా కార్డులు వచ్చిన వారికి ఈ నెల నుంచి రేషన్ బియ్యంతోపాటు ప్రభుత్వ పథకాలు కూడా అందనున్నాయి. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా 65,749 కార్డులు మంజూరు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో కొత్తగా 65,749 కార్డులను మంజూరు చేసింది. 82,364 మంది పేర్లను కార్డుల్లో కొత్తగా నమోదు చేసింది. తొలుత మే 20వ తేదీ వరకు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులకు పౌరసరఫరాల అధికారులు కార్డులు మంజూరు చేసింది. దాంతో జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యం జూన్‌లోనే ఒకేసారి ఇచ్చారు. దీంతో జిల్లాలో అప్పటి వరకు ఉన్న కార్డులతోపాటు కొత్తగా కార్డులు పొందిన 21,649 మంది సన్నబియ్యం తీసుకున్నారు. మే 20 తేదీ తరువాత రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అప్పటి నుంచి ఈనెల 13వ తేదీవరకు కొత్తగా మరో 44,099 కార్డులను మంజూరు చేసింది. అయితే వీరు జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో కార్డులు పొందినప్పటికీ రేషన్ తీసుకునే అవకాశం దక్కలేదు. దాంతో సెప్టెంబర్ 1 నుంచి ఇచ్చే కోటాలో కొత్తరేషన్ కార్డుదారులు మొదటిసారిగా సన్న బియ్యం తీసుకోనున్నారు.
రేషన్ కార్డులు జారీ చేయడంతో పేదలకు సమస్యలు తీరనున్నాయి. రేషన్ కార్డులేక ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికి దూరం కావడంతోపాటు పిల్లల చదువుల విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతేకాక ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం పెట్టినా దానికి రేషన్‌కార్డు తప్పనిసరి చేయడంతో చాలా మంది ఆ పథకాలకు దూరమయ్యారు. అంతే కాక ప్రభుత్వం ఆరోగశ్రీ ద్వారా ఇచ్చే వైద్య సేవలను కూడా పొందలేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కార్డులు జారీ చేయడంతో వారి సమస్యలు తీరనున్నాయి.
ఫ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పంపిణీ
ఫ మొదటిసారి బియ్యం తీసుకోనున్న 44,099 కుటుంబాలు
ఫ వారికి రేషన్‌తోపాటు అందనున్న ప్రభుత్వ పథకాలు
ఫ ఏళ్లనాటి కల నెరవేరుతుండడంతో లబ్ధిదారుల హర్షం
రేషన్ దుకాణాలు 991 పాత కార్డులు 4,62,554
కొత్తవి 65,749 మొత్తం 5,28,303
గతంలో బియ్యం కోటా 89.15 లక్షల క్వింటాళ్లు
వచ్చే నెల నుంచి కేటాయింపు 94.04 లక్షల క్వింటాళ్లు