
స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి
రామగిరి(నల్లగొండ) : స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని విదేశీ వస్తువులను నిషేధించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ జిల్లా కన్వీనర్ వినోద్ హిందుస్తానీ అన్నారు. గురువారం నల్లగొండలోని రామగిరి నుంచి గడియారం సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా, చైనా, టర్కీ మొదలైన విదేశీ వస్తువులను వాడకూడదని, మన దేశ ఉత్పత్తులనే వాడి, దేశ జీడీపీని పెంచి, ఇక్కడి పరిశ్రమలకు దన్నుగా నిలవాలన్నారు. విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం, చైనా, టర్కీ వంటి శత్రు దేశాల వస్తువులు, సేవలను బహిష్కరించడం విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకు బదులుగా భారత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ఇప్పుడు ఎంతో అవసరం అన్నారు. ప్రతి భారతీయుడు ‘స్వదేశీ సురక్షా ఔర్ స్వావలంబన్ అభియాన్’లో భాగమై, స్వదేశీ ఆచరణతో భారతాన్ని మళ్లీ మహోన్నత దేశంగా తీర్చిదిద్దే కర్తవ్యాన్ని స్వీకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పొట్టిపాక నాగరాజు, ఆవుల సంపత్, అమల, లక్ష్మి, శ్రీదేవి, మణికుమార్, హరీష్, బన్నీ, జయంత్, రుత్విక్, లక్ష్మీనివాస్, శ్రీకాంత్, వంశీ పాల్గొన్నారు.