కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి
వెల్దండ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం వెల్దండలో సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తేనే వారు నాయకులుగా గుర్తించుకుంటారన్నారు. గ్రామాల పరిపాలన పూర్తి బాధ్యత సర్పంచులకే ఉంటుందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు నిధులు మంజూరు చేస్తారు తప్ప.. పూర్తి అధికారాలు సర్పంచులకు ఉంటాయన్నారు. సర్పంచులకు మాత్రమే చెక్కు పవర్ ఉంటుందని బాధ్యతగా పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మరో మూడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచులు ప్రత్యేక దృష్టిపెట్టి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ, ఉపసర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీసింగ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, ఎంపీడీఓ సత్యపాల్‌రెడ్డి, కార్యదర్శి గిరి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పారు..
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం మాజీ సీఎం కేసీఆర్‌ను గద్దె దించారని ఎంపీ మల్లురవి పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిపించకుండా ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. కేసీఆర్, కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హేళన చేసి మాట్లాడడం సరికాదన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి మార్పు చూపించారన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు బుద్ధి చెప్పే సమర్థవంతమైన నాయకుడు రేవంత్‌రెడ్డి అనే అధిష్టానం గుర్తించిందన్నారు. అందుకు నిరంతరం కష్టపడి పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.


