అందరి భాగస్వామ్యంతో క్షయ నిర్మూలన
నాగర్‌కర్నూల్ క్రైం: అందరి భాగస్వామ్యంతోనే క్షయవ్యాధిని నిర్మూలించవచ్చని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ అన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి, రామాలయం వద్ద క్షయ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటుచేసి, 194 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. మద్యపానం, ధూమపానం చేసేవారితో పాటు మధుమేహ వ్యాధిగ్రస్తులు, వయోవృద్ధులు, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న క్షయ వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు తదితరులకు టీబీ సోకే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి వారి జాబితాను ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు సిద్ధంచేసి.. నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించారు. తద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధిగ్రస్తులను గుర్తించి, వెంటనే చికిత్స అందించవచ్చన్నారు. అనంతరం వ్యాధిగ్రస్తుల ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. న్యూట్రిషన్ కిట్ వినియోగంపై ఆరా తీశారు. కార్యక్రమంలో క్షయ నియంత్రణ అధికారి డా.రఫీక్, వైద్యాధికారి డా.వాణి, ఎంఎల్‌హెచ్‌పీ కీర్తన, సీహెచ్‌ఓ మినహాజ్, ఎస్‌టీఎస్ శ్రీను, ఆరిఫ్, ఏఎన్‌ఎంలు సరస్వతి, కవిత పాల్గొన్నారు.


