ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
● దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రతిభకనబరిచిన వారికి బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటుందన్నారు. సమాజంలో అందరూ గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రానున్న కొత్త సంవత్సరంలో ప్రతినెలలో ఒకరోజు దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అన్ని సంక్షేమ గురుకులాల్లో దివ్యాంగుల పిల్లలకు ప్రవేశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే అలిమ్కో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం సహాయక పరికరాల పంపిణీ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ క్యాంపుల ద్వారా దివ్యాంగులకు అవసరమైన ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, ఇతర సహాయక పరికరాలను అందించామని వివరించారు. అదే విధంగా జిల్లాలో ఏర్పాటుచేసిన భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణతో పాటు మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి, దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, మహిళా అధ్యక్షురాలు నారాయణమ్మ, కార్యదర్శి పరశురాములు నాయకులు శ్యామ్, నవీన్‌కుమార్ రెడ్డి, రాజశేఖర్, కురుమయ్య, కొడావాత్ రవి, శంకర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


