క్రిస్మస్ వేడుకలకు ముస్తాబు
● విద్యుద్దీపాలతో చర్చిల అలంకరణ
నాగర్‌కర్నూల్/కందనూలు: క్రిస్మస్ పర్వదినానికి జిల్లాలోని చర్చిలు ముస్తాబు అయ్యాయి. గురువారం పండగ సందర్భంగా కరుణామయుడి కోవెలలను వివిధ రంగుల స్టార్స్, క్రిస్మస్ ట్రీస్, విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. ముఖద్వారాలను అందంగా తీర్చిదిద్దారు. క్రైస్తవులు తమ ఇళ్లపై ఏర్పాటుచేసిన నక్షత్రాకార చిహ్నాలతో పండుగ శోభ సంతరించుకుంది. చర్చిల్లో ఏసుక్రీస్తు జననం, శాంతి సందేశాలు, జీవిత విషయాలతో కూడిన చిత్రవర్ణ పటాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయా చర్చిల్లో ముందస్తుగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందస్తు వేడుకలతో చర్చిలన్నీ కోలాహలంగా మారాయి. ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారు సైతం పండగకు స్వగ్రామాలకు వచ్చారు. జిల్లాలోని పలు వ్యాపార సంస్థలు పండగకు సంబంధించిన వస్తువులను అందుబాటులో పెట్టారు. క్రిస్మస్ ట్రీస్‌తో పాటు స్టార్స్, గ్రీటింగ్, ఫేస్‌మాస్క్‌లు ఇతర అలంకార వస్తువులకు భలే గిరాకీ ఉంది. ఆయా దుకాణాల్లో సందడి నెలకొంది.
పండగను ఆనందంగా జరుపుకోవాలి..
క్రిస్మస్ పర్వదినాన్ని జిల్లా ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకాంక్షించారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకొని జిల్లాలోని క్రైస్తవులకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్‌ను ఎంతో పవిత్రమైన పండగగా భావిస్తారని.. యేసు ప్రభువు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరారు. ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని ఆయన కాంక్షించారు.


