27న లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
కందనూలు: జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉన్న సీతారామస్వామి ఆలయంలో ఈ నెల 27న లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కల్యాణ వేడుక వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఉత్తమ పోలీసులకురివార్డులు
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు కేసులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చడంలో ఉత్తమ ప్రతిభకనబరిచిన జిల్లా పోలీసు సిబ్బందికి డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీ శ్రీనివాసరావు రివార్డులను అందజేసినట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్ బుధవారం తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఐటీ సమన్వయకర్తగా పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ నర్సింహ, ఐటీ కోర్ సభ్యుడు హెడ్‌కానిస్టేబుల్ నాగార్జున, కల్వకుర్తి పోలీస్‌స్టేషన్ టెక్నికల్ టీం రైటర్ హరిలాల్, నాగర్‌కర్నూల్ స్టేషన్ టెక్నికల్ టీం రైటర్ హనుమంతు నాయక్ రివార్డులకు ఎంపికై ప్రశంసాపత్రాలు అందుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసుశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ అకింతభావంతో పనిచేస్తూ జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఎస్పీ సూచించారు.
జలాశయం సామర్థ్యం తగ్గించే వరకు ఆందోళన
చారకొండ: మండలంలోని గోకారంలో నిర్మించే డిండి –నార్లాపూర్ ఎత్తిపోతల పథకం జలాశయం సామర్థ్యం తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు తేల్చిచెప్పారు. ఎర్రవల్లిలో నిర్వాసితులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 23వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోకారం జలాశయం సామర్థ్యం తగ్గించాలని శాంతియుతంగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి తమ గ్రామాలను ముంపు నుంచి మినహాయించాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ జీఓను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు
కందనూలు: కరీంనగర్‌లో గురువారం నుంచి 28వ తేదీ వరకు నిర్వహించే 72వ సీనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బుధవారం జిల్లా జట్టు బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్యగౌడ్ అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభకనబరిచి ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. కాగా, క్రీడాకారులకు రాచూర్ సర్పంచ్ శ్రీనివాసులు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ యామిని, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మంజుల శ్రీనివాసులు, సభ్యులు రమేశ్, మోహన్‌లాల్ పాల్గొన్నారు.
రేపు సీపీఐ శతాబ్ది ఉత్సవాలు
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లా కేంద్రంలో ఈ నెల 26న సీపీఐ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీపీఐ పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం బస్టాండ్ కూడలిలో పార్టీ జెండావిష్కరణ, కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
27న లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
27న లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం


