గవర్నర్‌ దృష్టికి ప్రముఖుల సేవలు | - | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ దృష్టికి ప్రముఖుల సేవలు

Dec 24 2025 5:51 AM | Updated on Dec 24 2025 5:51 AM

గవర్నర్‌ దృష్టికి ప్రముఖుల సేవలు

గవర్నర్‌ దృష్టికి ప్రముఖుల సేవలు

జిల్లాకు వివిధ రంగాల్లో సేవలందించిన 12 మంది ప్రముఖుల గురించి అధికారులు గవర్నర్‌ దృష్టికి తెచ్చారు. వీరిలో విశ్రాంత ఐఏఎస్‌ దినకర్‌బాబుతోపాటు పద్యకవులు ఆకుల శివరాజ లింగం, సందాపురం బిచ్చయ్య, కూచిపూడి నృత్యకారిణి వంగీపురం నీరజాదేవి, విశ్వ మానవతా సంస్థ శ్రీనివాస అల్లూరి, అంధత్వాన్ని జయించి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రాణిస్తున్న పెరవల్లి గాయత్రి, శిల్పి బైరోజు చంద్రశేఖర్‌, సెపక్‌తక్రా అంతర్జాతీయ క్రీడాకారిణి రాళ్ల నవత, బాక్సింగ్‌ క్రీడాకారుడు నున్సావత్‌ వెంకటేష్‌, పోచ రవీందర్‌రెడ్డి, చిత్రకారుడు గడ్డం శివకుమార్‌, జానపద కళాకారుడు రాజారాం ప్రకాష్‌ గవర్నర్‌తో పరిచయం చేసుకున్నారు.

దక్షిణకాశీలో ప్రత్యేక పూజలు

దక్షిణకాశీ క్షేత్రానికి చేరుకున్న గవర్నర్‌కు దేవాదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.హరీష్‌, ఈఓ దీప్తి అర్చక స్వాములతో కలిసి పూర్ణకుంబ స్వాగతం పలికారు. ముందుగా గవర్నర్‌ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో విఘ్నేశ్వరుడికి, అనంతరం స్వామివారి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు జరిపించారు. అలాగే జోగుళాంబదేవిని దర్శించుకొని కుంకుమార్చన, విశేష పూజలు జరిపించారు. అంతకు ముందు అలంపూర్‌ చేరుకున్న గవర్నర్‌కు ఎంపీ మల్లురవి, కలెక్టర్‌ బీఎం సంతోష్‌, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే విజయుడు పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయా కార్యక్రమాల్లో గవర్నర్‌ సంయుక్త కార్యదర్శి భవానీశంకర్‌, ఏడీసీ మేజర్‌ అమన్‌ కుందూ, ఏడీసీ కాంతిలాల్‌ పటేల్‌, సీఎస్‌ఓ శ్రీనివాసరావు, వ్యక్తిగత కార్యదర్శి పవన్‌సింగ్‌, గద్వాల అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీఓ అలివేలు, డీసీసీబీ మాజీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, డీఎస్పీ మొగలయ్య, పురావస్తు శాఖ ఇంజినీర్‌ కిశోర్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్‌ మంజుల తదితరులు పాల్గొన్నారు.

చేనేత మగ్గం నేసి..

గద్వాల జరీ చీరల ప్రాముఖ్యత తెలుసుకున్న గవర్నర్‌ చేనేత స్టాల్‌ దగ్గర కార్మికులతో మాట్లాడారు. నెలకు ఎన్ని చీరలు నేస్తారు.. కూలీ ఎంత వస్తుందని ఆరాతీశారు. ఖండాంతర ఖ్యాతి ఘడించిన గద్వాల జరీ చీరల ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేయాలని సూచించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్‌లో మగ్గంపై కూర్చొని చీర నేసే విధానాన్ని పరిశీలించి.. రాట్నం ద్వారా ధారం చుట్టారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ పరిశీలించి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన రక్తదాన శిబిరాల వివరాలు తెలుసుకుని ప్రశంసించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో రాజ్‌భవన్‌ను లోక్‌భవన్‌గా మార్చామన్నారు. అంతకు ముందు కలెక్టర్‌ సంతోష్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, ప్రసిద్ధ క్షేత్రాలు, ప్రాముఖ్యత, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు గద్వాల జరీ చీర ఫ్రేమ్‌ను జ్ఞాపికగా అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement