మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కృషి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతి గర్భిణి సురక్షిత మాతృత్వం పొందడంతోపాటు మాతాశిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో వైద్య సిబ్బంది పనిచేయాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రవికుమార్ అన్నారు. ఇటీవల లట్టుపల్లి, పెంట్లవెల్లి, అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతాశిశు మరణాలపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం వైద్య సిబ్బంది సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతాశిశు మరణాలు జరగకుండా వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. ఆశాలు ఎల్‌ఎంపీ రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, గర్భం దాల్చిన 12 వారాలలోపు నమోదు చేసుకుని రక్త నమూనాలు సేకరించి జిల్లాకేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్‌కు పంపాలన్నారు. గర్భిణులను పరీక్షించిన ప్రతిసారి రక్తపోటు, హిమోగ్లోబిన్, బ్లడ్ షుగర్ స్థాయి, బరువును పరీక్షించడం తదితర ప్రాథమిక పరీక్షలు తప్పకుండా చేయాలన్నారు. పర్యవేక్షణ సిబ్బంది గుర్తించిన హైరిస్క్ గర్భిణులు ప్రత్యేక దృష్టిపెట్టి సురక్షిత మాతృత్వం పొందే వరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శిశువులలో పుట్టుకతో వచ్చే అవయవ లోపాలను నివారించడానికి ప్రతి గర్భిణికి ప్రత్యేక టిఫా స్కానింగ్ పరీక్ష జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో తప్పకుండా చేయించాలని తెలిపారు. ఆశాలు గర్భిణులలో రక్తహీనతను అరికట్టడానికి ప్రతిరోజు ఐరన్, ఫోలిక్, క్యాల్షియం మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ రామకృష్ణ, ప్రోగ్రాం అధికారి లక్ష్మణ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భరత్‌కుమార్‌రెడ్డి, గైనకాలజిస్టులు కవిత, రాజేష్‌గౌడ్ పాల్గొన్నారు.


