రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
నాగర్‌కర్నూల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి రోడ్డు భద్రత సమావేశంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జి పాటిల్, అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రోడ్డు భద్రత ప్రమాణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అతివేగమే ప్రధాన కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో గుర్తించిన బ్లాక్ స్పాట్లు నెల్లికొండి స్టేజీ, మంగనూరు, పాలెం, బిజినేపల్లి, లింగసానిపల్లి, గుమ్మకొండ, తాడూరు, పెద్దకొత్తపల్లి చౌరస్తా, వెల్దండ చెరుకూరు గేట్, కొట్ర, బీపీనగర్, వంగూరు, కల్వకుర్తి తదితర ప్రాంతాల్లో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో అధ్యయనం చేసి తగిన నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్ల వద్ద రహదారి వెడల్పు, స్పీడ్ బ్రేకర్లు, రోడ్డు మార్కింగ్, రిఫ్లెక్టర్ బోర్డులు, హెచ్చరిక సూచికలు, క్యాట్ ఐస్, సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ, పీఆర్ అధికారులను ఆదేశించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై ప్రజలను చైతన్యం చేయాలని, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జాతీయ రహదారులకు సమీప గ్రామాల్లో సీపీఆర్ శిక్షణ ఇవ్వాలన్నారు. కలెక్టరేట్ గేట్ వద్ద తాత్కాలిక బస్టాప్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్‌కు సూచించారు. కలెక్టరేట్‌కు ద్విచక్రవాహనాలపై వచ్చేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వచ్చే నెలలో నిర్వహించే రోడ్డు భద్రత మాస, వారోత్సవాల్లో హెల్మెట్ ర్యాలీలు, వాక్‌థాన్, ముగ్గుల పోటీలు, ప్రతిజ్ఞ, ఆరోగ్య శిబిరాలు, పాఠశాలల్లో వ్యాస, డ్రాయింగ్, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక తనిఖీలు చేపడతామన్నారు. సమావేశంలో ఆర్టీఏ మెంబర్ గోపాల్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు, ఆర్డీఓలు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.


