జూరాలకు క్రాప్ హాలిడే ప్రకటించలేదు : మంత్రి
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించినట్లు ప్రభుత్వం చెప్పలేదని.. ఆధారాలు ఉంటే చూపించాలని రాష్ట పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులో తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. 1.50 లక్షల క్యూసెక్కుల వరద జలాశయానికి చేరితే కూలుతుందని బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కూలేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సారించిందని.. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో అభివృద్ధి పనులకు రూ.15 కోట్లు ఖర్చు చేశామన్నారు. జూరాల సమీపంలో 108 ఎకరాల్లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని, అలాగే అమరచింతలోని దుంపాయికుంటలో ఉన్న 14 ఎకరాల్లో పేదలకు ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తామని వివరించారు. కార్యక్రమంలో టీపీసీసీ చైర్మన్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర చైర్మన్ నాగరాజుగౌడ్, నాయకులు అయ్యూబ్‌ఖాన్, పట్టణ అధ్యక్షుడు అరుణ్‌కుమార్, ఎంపీటీసీ మాజీ సభ్యులు తిరుమల్లేష్, మహంకాళి, మార్కెట్ డైరెక్టర్ విష్ణు, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
● అమరచింత పురపాలికలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీపీఎం మండల నాయకులు జీఎస్ గోపి, అజయ్, వెంకటేష్, రమేష్ మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు.


