పకడ్బందీగా ఓటరు జాబితా మ్యాపింగ్
నాగర్‌కర్నూల్: ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 880 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ప్రత్యేక సమగ్ర సవరణను సమర్థవంతంగా నిర్వర్తించేలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూతు స్థాయి అధికారులను నియమించామన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు పోలింగ్ కేంద్రాల స్థాయిలో ఎంత వరకు పూర్తయ్యిందో వివరాలు తెలుసుకున్నారు. 2002 నుంచి ఉన్న ఓటరు జాబితాను 2025 ఓటరు జాబితా ప్రమాణాలకు అనుగుణంగా సవరించడం అత్యంత కీలకమని, ఈ మ్యాపింగ్‌ను పూర్తిగా జాగ్రత్తగా, కచ్చితంగా చేపట్టాలన్నారు. ఏఈఆర్‌ఓలు తమ పరిధిలో పూర్తి బాధ్యత తీసుకుని, బీఎల్‌ఓలకు రోజువారి లక్ష్యం నిర్దేశించి మ్యాపింగ్ వేగం పెంచాలని సూచించారు. ప్రతి నియోజకవర్గం స్థాయిలో మ్యాపింగ్ పురోగతిని ఈఆర్‌ఓలతో నేరుగా సమీక్షించి, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ఎన్నికల సంబంధిత ఏవైనా సహాయం, సూచనల కోసం కలెక్టరేట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. వచ్చేవారం సమగ్ర సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ ఏఈఆర్‌ఓలను ఆదేశించారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
భూ భారతి రెవెన్యూ సదస్సుల స్వీకరించిన అర్జీలను వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల ప్రకారం రెవెన్యూ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యల దరఖాస్తులు, రిజిస్టర్లను పరిశీలించడంతోపాటు విద్యార్థులకు అవసరమైన ధ్రువపత్రాలను వెంటనే జారీ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అంశాలపై అధికారులు ప్రాధాన్యత ఇస్తూ పనిచేయాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


