విద్యార్థుల్లో దృష్టిలోపాలు గుర్తించాలి
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టి లోపాలను గుర్తించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రవికుమార్ అన్నారు. సోమవారం ఉయ్యాలవాడలోని మహాత్మ జ్యోతిరావుపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలోని 332 ఉన్నత, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న 53,504 మంది విద్యార్థులకు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్–ఏ ఎక్కువగా ఉండే పాలకూర, మునగాకు, కరివేపాకు, ఆకుకూరలు, క్యారెట్ తదితర కూరగాయలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించి మార్చిలో ఉచితంగా కంటి అద్దాలను సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నవనీత, ఆర్‌బీఎస్‌కే వైద్యులు అభిషేక్, మహతి, నేత్రాధికారులు వెంకటస్వామి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


