దిగుబడికి మంగళం | - | Sakshi
Sakshi News home page

దిగుబడికి మంగళం

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

గోవిందరావుపేట: సన్నవడ్లు సాగు చేస్తే మంచి దిగుబడి.. దానికి తోడు క్వింటాకు రూ.500 బోనస్‌.. నాలుగు రూపాయలు వెనకేసుకోవచ్చన్న ఆశతో వరి నాట్లు వేసిన రైతులకు ఇప్పుడు కష్టాలు ఎదురయ్యాయి. మంగళ సీడ్స్‌ సిద్ది–44 విత్తనాలను నమ్మి సాగు చేసిన రైతులు పంట ఎదుగుదల లేక ఆందోళన చెందుతున్నారు. 135–145 రోజులకు పంట చేతికి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 110 రోజులు దాటినా వరి పొట్టదశకు రాకపోవడంతో నష్టపోయామని భావించిన రైతులు పంటసాగుకు చేసిన అప్పులు ఎలా తీరాలని, పెట్టిన పెట్టుబడులు ఎలా వస్తాయని లబోదిబోమంటున్నారు.

150 మందికిపైగా సాగు..

మండల పరిధిలోని దుంపెల్లిగూడెం, రాంనగర్‌, మాన్యతండా, లక్ష్మీపురం, కర్లపల్లి, బాలాజీనగర్‌, తాతయ్యపల్లి గ్రామాలకు చెందిన సుమారు 150 మందికి పైగా రైతులు 1500 ఎకరాలల్లో ఈ విత్తనాలు సాగు చేసినట్లు సమాచారం. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు రాత్రింభవళ్లు నీటిని పెట్టుకుంటూ పంటను కాసాడుకున్నా ఆశించిన ఎదుగుదల కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇతర కంపెనీల విత్తనాలు సాగు చేసిన రైతుల పంట కోతకు రాగా మంగళ సీడ్స్‌ పంట మాత్రం పొట్టదశకు కూడా చేరలేదని రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు 15 రోజుల క్రితం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంట పొలాల పరిశీలన.. నమూనాల సేకరణ

కలెక్టర్‌ భోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ఆదేశాల మేరకు వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన డాక్టర్‌ విశ్వతేజ బృందం మండల వ్యవసాయశాఖ అధికారి జితేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పంట పొలాలను పరిశీలించి నమూనాలను సేకరించారు. పరిశీలన సందర్భంగా కంపెనీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు అక్కడికి రావడంతో సుమారు 100 మంది రైతులు మూడు గంటల పాటు వారిని నిలదీసి తమకు జరిగిన నష్టంపై ప్రశ్నించారు. ఎకరానికి లక్ష రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత నష్టపరిహారం అంశంపై స్పందిస్తామని కంపెనీ యాజమాన్యం ఫోన్‌లో హామీ ఇవ్వగా కంపెనీ ప్రతినిధులను అక్కడి నుంచి పంపించినట్లు సమాచారం. నష్టపోయిన రైతులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షల నివేదికను పారదర్శకంగా వెల్లడించి, లోపాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు పరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement