హెచ్‌ఐవీ ముప్పు | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ ముప్పు

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

హెచ్‌ఐవీ ముప్పు డిజిటల్‌ పరిచయాలు..

డిజిటల్‌ పరిచయాలు..

సాక్షి, వరంగల్‌ : స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చాక పరిచయాల పరిధి విస్తరించింది. ఎక్కడో ఉన్న వ్యక్తులతోనూ క్షణాల్లో స్నేహం చేయగలుగుతున్నారు. ముఖ్యంగా డేటింగ్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌లు అపరిచితులను దగ్గర చేస్తున్నాయి. ఈ పరిచయాలు కొన్నిసార్లు ప్రత్యక్ష కలయికలకు, అక్కడినుంచి శారీరక సంబంధాలకు దారితీస్తున్నాయి. పరస్పర ఆరోగ్య పరిస్థితిపై అవగాహన లేకపోవడం, కండోమ్‌ వినియోగం వంటి రక్షణ చర్యలను విస్మరించడం హెచ్‌ఐవీతోపాటు ఇతర లైంగిక సంక్రమిత వ్యాధుల ముప్పును పెంచుతోంది. ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో ’గ్రిండర్‌’ వంటి లొకేషన్‌ ఆధారిత డేటింగ్‌ యాప్‌ల ద్వారా పరిచయాలు పెంచుకుని కొందరు అసురక్షిత సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో హెచ్‌ఐవీ బారిన పడుతున్న సంఘటనలు వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 2005 నుంచి 2026 వరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 8,208 మంది హెచ్‌ఐవీ రోగులుంటే.. ఇటీవల నిర్ధారణ అయిన కేసుల్లో ఐదుగురు ఎంఎస్‌ఎం రోగులుండడం కలవరపెడుతోంది.

యాప్‌లో పరిచయం.. ప్రత్యక్షంగా కలయిక

గ్రిండర్‌ వంటి యాప్‌లు లొకేషన్‌ ఆధారంగా పనిచేస్తాయి. లాగిన్‌ కాగానే యూజర్‌ ఉన్న ప్రాంతానికి 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లాగిన్‌ అయినవారి ప్రొఫైళ్లు కనిపిస్తాయి.

● ముఖ్యంగా ‘మెన్‌ సెక్స్‌ విత్‌ మెన్‌’ (ఎంఎస్‌ఎం) , బైసెక్సువల్‌, ట్రాన్స్‌జెండర్‌, క్వీర్‌ వర్గాల వా రి కోసం పనిచేసే ఈ యాప్‌లలో చాలామంది అపరిచితులతో త్వరగా కనెక్ట్‌ అవుతున్నారు.

● కొందరు స్నేహలు చేస్తుంటే, ఇంకొందరు మరో అడుగు ముందుకేసి శారీరక సంబంధాలు పెట్టుకుంటున్నారు.

● ముందస్తు రక్షణ చర్యలు పాటించకుండా కలు సుకోవడంతో హెచ్‌ఐవీతోపాటు ఇతర లైంగిక వ్యాధుల బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

● హనుమకొండకు చెందిన 24 ఏళ్ల ఓ ఉద్యోగి గ్రిండర్‌ యాప్‌ ద్వారా తన నివాసానికి కొద్ది కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న అపరిచిత వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు ప్రత్యక్షంగా కలుసుకుని శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఎలాంటి సురక్షిత పద్ధతులు (కండోమ్‌ వాడకం) పాటించకపోవడంతో కొన్ని నెలల తర్వాత తీవ్ర జ్వరం, నీరసంతో బాధపడ్డాడు. స్థానిక ఐసీటీసీ (సమన్వయ సమాచార, పరీక్షా కేంద్రం)లో పరీక్షించుకోగా హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది.

జాగ్రత్తలతోనే కల్లెం...

ఆన్‌లైన్‌ పరిచయాలయ్యాక శారీరకంగా కలవాల్సి వస్తే తప్పనిసరిగా కండోమ్‌లు వాడాలి. హెచ్‌ఐ వీ వ్యాప్తి నిరోధానికి వైద్యుల సలహాతో అందుబాటులో ఉండే ప్రీ ఎక్స్‌పోజర్‌ ప్రొఫిలాక్సిస్‌ మాత్రల గు రించి అవగాహన పెంచుకోవాలి. యాక్టివ్‌గా ఉండే వినియోగదారులు ప్రతీ మూడు నుంచి ఆరు నెలలకోసారి హెచ్‌ఐవీ/ఎస్‌టీఐ పరీక్షలు చేయించుకో వడం మంచిది. తాత్కాలిక ఆకర్షణ కోసం ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టొద్దు.

– డాక్టర్‌ పొరల్ల సమ్మయ్య,

నోడల్‌ ఆఫీసర్‌, ఏఆర్‌టీ సెంటర్‌, ఎంజీఎం

డేటింగ్‌ యాప్‌లలో ఎంట్రీ...

ఆపై శారీరక సంబంధాలు

సురక్షిత పద్ధతులు పాటించకపోవడంతో వ్యాధుల సంక్రమణ

ఉమ్మడి జిల్లాలో ఇటీవల

ఐదు ఎంఎస్‌ఎం కేసుల నిర్ధారణ

వరంగల్‌ నగరానికి చెందిన ఒక ప్రైవేట్‌ కళాశాల విద్యార్థి (21) సరదాగా గ్రిండర్‌ యాప్‌లో లాగిన్‌ అయ్యాడు. యాప్‌ లొకేషన్‌ ఫీచర్‌ ద్వారా పరిచయమైన మరో వ్యక్తితో కొద్ది రోజుల్లోనే సన్నిహితంగా మెలిగాడు. రక్షణ చర్యలు పాటించకుండానే శారీరకంగా కలిశాడు. ఇటీవల రక్తపరీక్షల్లో హెచ్‌ఐవీ సోకినట్లు నిర్ధారణ అయింది. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న సదరు విద్యార్థి.. డేటింగ్‌ యాప్‌లలో ఆకర్షణకు లోనై రక్షణ చర్యలు తీసుకోలేదని కౌన్సెలర్‌ ముందు వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement