పనులు పూర్తయ్యేనా? | - | Sakshi
Sakshi News home page

పనులు పూర్తయ్యేనా?

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

రామన్నగూడెంలో ప్రమాదకరంగా ఉన్న పుష్కరఘాట్‌

ఏటూరునాగారం: గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు పుష్కరఘాట్ల మరమ్మతులు, నూతన ఘాట్‌ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు సైతం మంజూరు చేసింది. అయినా పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నట్లు ప్రజల్లో చర్చసాగుతోంది. ఆలస్యంగా పనులు ప్రారంభిస్తే గడువులోపు పనులు పూర్తయ్యేనా అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

12 ఏళ్లకు ఒకసారి..

పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ పవిత్ర గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు జిల్లాలోని పుష్కరఘాట్ల మరమ్మతులు, నూతన ఘాట్‌ నిర్మాణంతో పాటు ఆలయాల పునరుద్ధరణ పనులు, వసతుల కల్పన, అభివృద్ధి ప్లాన్‌లను సిద్ధం చేశారు. లక్ష మందిపైగా వచ్చే ఘాట్‌కు టైర్‌ 1(కేటగిరి), 50 వేల మంది భక్తులు వచ్చే ఘాట్‌లను టైర్‌ 2గా, అంతకంటే తక్కువ వచ్చే ఘాట్‌లను టైర్‌ 3లుగా నిర్ణయించారు. అదే విధంగా వాజేడులోని పూసూరు, వెంకటాపురం (కె) మండలం మరికాల, మంగపేట మండలం మల్లూరు, చుంచుపల్లి వద్ద పుష్కరఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా కేవలం చుంచుపల్లి వద్ద మాత్రమే ఘాట్‌ నిర్మాణానికి మంజూరు ఇచ్చారు. దీంతో కేవలం పాత ఘాట్ల మరమ్మతులు, ఒక ఘాట్‌ నిర్మాణానికి నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

నిధులు మంజూరు.. ప్రారంభం కాని పనులు

జిల్లాలో 5 పుష్కరఘాట్‌ల పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అందులో మంగపేట మండల పరిధిలోని చుంచుపల్లిలో నూతనంగా పుష్కర ఘాట్‌ నిర్మించేందుకు రూ.3 కోట్లు కేటాయించగా టెండర్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మంగపేట మండల కేంద్రంలో 2015లో వచ్చిన పుష్కరాల కోసం నిర్మించిన పాత ఘాట్‌ గోదావరి వరదలకు కొట్టుకుపోయింది. అలాగే ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం వద్ద ఉన్న పాత ఘాట్‌ గోదావరి వరదలకు దెబ్బతిని ప్రమాదకరంగా మారింది. దాని మరమ్మతుకు సైతం నిధులు మంజూరయ్యాయి. అలాగే ముళ్లకట్ట వద్ద 2015లో నిర్మించిన పుష్కరఘాట్‌ మరమ్మతులు సైతం నిధులు కేటాయించారు. అదేవిధంగా వెంకటాపురం(కె) మండల పరిధిలోని రామచంద్రాపురం వద్ద గతంలో ఏర్పాటు చేసిన ఘాట్‌ మరమ్మతులకు సైతం నిధులను ప్రభుత్వం కేటాయించింది. వీటికి టెండర్లు పూర్తి అయినట్లు భారీ నీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పనులు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

త్వరలోనే పనులు ప్రారంభిస్తాం..

జిల్లాలో ఐదు పుష్కరఘాట్ల పనులకు నిధులు మంజూరయ్యాయి. చుంచుపల్లిలో నూతనంగా పుష్కర ఘాట్‌ నిర్మించేందుకు టెండర్‌ పూర్తికాలేదు. మిగితా పుష్కరఘాట్ల మరమ్మతు పనులకు టెండర్లు పూర్తి చేశాం. పనులు త్వరలోనే చేపట్టి సకాలంలో పూర్తి చేస్తాం.

– శంకరయ్య, భారీ నీటిపారుదలశాఖ ఈఈ, ఏటూరునాగారం

పుష్కరఘాట్ల

మరమ్మతుల్లో జాప్యం

నాలుగు ఘాట్ల పనులకు టెండర్లు పూర్తి

చుంచుపల్లికి ఖరారు కాని టెండర్‌

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement