ఏటూరునాగారం: జిల్లాలోని చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ (ప్రత్యేక అవసరాల పిల్లలు)కు తెలంగాణ సమగ్ర సంరక్షణ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జుయాలజికల్ పార్క్‌ను మంగళవారం సందర్శించారు. అనంతరం హైదరాబాద్‌లోని అన్ని ప్రదేశాలను సందర్శించి అక్కడ ఉన్న విశిష్టత తెలుసుకున్నారని ఐఈఆర్‌టీ టీచర్లు స్వరూపరాణి, రమేష్‌లు తెలిపారు. దీంతో దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేశారు.
నేడు సీతారాముల
విగ్రహ ప్రతిష్ఠాపన
ములుగు: జిల్లా కేంద్రంలోని రామాలయంలో నేడు(బుధవారం) శ్రీ సీతారామ, లక్ష్మణ విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం విశ్వక్సేనారాధన, పుణ్యాహావచనం, వాస్తు పూజలు, పంచగవ్యప్రాశనం, క్షీరాధివాసం, జలాధివాసం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ధాన్యాధివాసం, శయనాధివాసం, అగ్నికార్యం పూజలు చేపట్టారు. మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై శ్రీ సీతారాముల విగ్రహాలకు జలాభిషేకం, పాలాభిషేకం చేశారు. బుధవారం ఉదయం 10.15 గంటలకు శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు, మహాకుంభాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం 12.30 గంటలకు మహా అన్నప్రసాద వితరణ చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
18న జిల్లాస్థాయి
యువజనోత్సవాలు
ములుగు: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈ నెల 18న జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ధర్మానాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 నుంచి 29 ఏళ్లలోపు యువతకు జానపద నృత్యం, గీతాలు, పెయింటింగ్, వీధి నాటకం, కవిత్వ రచనలో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు మై భారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆధార్, ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. విజేతలకు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 9676534013లో సంప్రదించాలని కోరారు.
అధికారులను
అడ్డుకున్న రైతులు
కాళేశ్వరం: కాళేశ్వరం నుంచి కన్నెపల్లి వరకు ఎన్‌హెచ్–353(సీ) రహదారి విస్తరణ పనులకు మరోసారి ఆటంకం ఏర్పడింది. మహదేవపూర్ టు కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వరకు 17 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.163 కోట్లు మంజూరు చేసింది. రామగుండంలో స్వయాన పీఎం నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ పనుల కోసం కాళేశ్వరం సబ్‌స్టేషన్ శివారు నుంచి రైతుల పొలాల మీదుగా కన్నెపల్లి వరకు కాళేశ్వరం, కన్నెపల్లి గ్రామాలకు చెందిన సుమారు 45మంది రైతులకు చెందిన 11.20 ఎకరాల భూమిని గతంలో సర్వే చేసి, పరిహారం సొమ్మును కూడా డిపాజిట్ చేశారని తెలిసింది. మంగళవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది మరోసారి సర్వేకు రాగా రైతులు అడ్డుకున్నారు. గతంలో నిర్వహించిన సర్వే సక్రమంగా లేదని రీ సర్వే చేయాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో సర్వే అధికారులు వెనుదిరిగారు. ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ రహదారి పనులు ప్రారంభమవుతాయని ఆశించిన తరుణంలో మళ్లీ సర్వే వివాదం తెరపైకి రావడంతో పనుల జాప్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికి మహదేవపూర్ టు కాళేశ్వరం వరకు సుమారు 14 కిలోమీటర్ల దూరం ఫారెస్టు క్లియరెన్స్ కూడా రావాల్సి ఉంది.


