ఇసుక క్వారీ నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ | - | Sakshi
Sakshi News home page

ఇసుక క్వారీ నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

● 9వ ఇసుక రీచ్‌ ఏర్పాటుకు గిరిజన సొసైటీ ఆమోదం

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు గ్రామ సమీపంలో గల గోదావరిలో 9వ ఇసుక క్వారీ నిర్వహణపై టీఎస్‌ఎండీసీ ప్రతిపాదనపై పర్యావరణ అనుమతులు పొందేందుకు అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు రీజినల్‌ కార్యాలయం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సునీత మాట్లాడుతూ గోదావరి నదిలో 19.95 హెక్టార్ల విస్తీర్ణంలో మాన్యువల్‌ పద్ధతిపై 3.99 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక సేకరణకు గ్రామసభను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాయి మానస నేచర్‌ టెక్‌ ప్రైవేటు లిమిటెడ్‌ వారు పూర్తి మాన్యువల్‌ పద్ధతిలో ఇసుకను తీసేందుకు చేతి పనిముట్లు ఉపయోగించడం, ఇసుకను ట్రక్కులలో రవాణా చేసేలా తదితర 12 అంశాలపై గ్రామ ప్రజలకు వివరించారు. ఇసుక క్వారీ ఏర్పాటుతో గ్రామంలోని కూలీలకు, నిరుద్యోగ యువతకు ఉపాధి చేకూరుతుందని వెల్లడించారు. దీంతో గ్రామస్తులు క్వారీ ఏర్పాటుకు అంగీకరిస్తూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించిన ప్రజల అభిప్రాయాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సూచనలు, సలహాలతో చిత్రీకరించిన వీడియోను పర్యావరణ మంత్రిత్వశాఖకు పంపిస్తామని తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎండీసీ పీఓ వెంకటేశ్‌, తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీడీఓ భద్రు, ఏటూరునాగారం సీఐ సూర్యప్రకాశ్‌, ఎస్సైలు మధుకర్‌, శ్రీకాంత్‌, పీసీబీ ఏఈ సుభాశ్‌, పంచాయతీ స్పెషలాఫీసర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నవీన్‌, గిరిజన సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement