ములుగు రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. అందుకు గాను ప్రత్యేకంగా తయారు చేసిన అభ్యాసన దీపికలను పాఠశాలలకు అందించారు. ఈ మేరకు పదో తరగతి విద్యార్థులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు. దసరా సెలవులు పూర్తి అయినప్పటి నుంచి ప్రత్యేక బోధన ప్రారంభించారు. సాయంత్రం అదనంగా గంట సమయం పదో తరగతి విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నారు. ఎస్‌ఏ–01 పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థి స్థాయిని బట్టి ఏ, బీ, సీ, గ్రూప్‌లుగా విభజించి విద్యాబోధన చేపట్టారు.
2,405 మంది విద్యార్థులు
జిల్లాలోని పది మండలాల పరిధిలో 2,405 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 2 ఉండగా జెడ్పీ ఉన్నత పాఠశాలలు 38 ఉన్నాయి. అలాగే కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు 9, మోడల్ పాఠశాలలు 3 ఉండగా గురుకుల పాఠశాల ఒకటి ఉంది. ఈ పాఠశాలల్లో 1,557మంది విద్యనభ్యసిస్తుండగా వీటితో పాటు ట్రైబల్ సొసైటీ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలల్లో 848 మంది పదో తరగతి విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. అదే విధంగా విద్యార్థులకు మరింత బోధించేలా స్పెషల్ క్లాస్‌లపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అలాగే ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు అదనంగా తరగతులు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ
పదో తరగతి ప్రత్యేక తరగతుల నిర్వహణపై రాష్ట్ర, జిల్లా కమిటీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిత్యం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులకు పలు సూచనలు అందిస్తున్నారు. పాఠశాలలకు అభ్యాసన దీపికలను పంపిణీ చేశారు. డిసెంబర్ నెల చివరి వరకు సిలబస్ పూర్తి చేసుకొని జనవరి నుంచి రివిజన్ క్లాస్‌లు బోధించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.
‘పది’ విద్యార్థులకు
స్పెషల్ తరగతులు
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రణాళికలు
అభ్యాసన దీపికల పంపిణీ
డిసెంబర్ చివరి వరకు సిలబస్ పూర్తి


