16 ఏళ్ల తర్వాత.. జనాభా లెక్కలు! | - | Sakshi
Sakshi News home page

16 ఏళ్ల తర్వాత.. జనాభా లెక్కలు!

Nov 10 2026 1:31 AM | Updated on Nov 10 2026 1:31 AM

స్వయంగా నమోదు చేసుకునే అవకాశం..

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : జనాభా లెక్కలకు ముహూర్తం ఖరారైంది. ఇళ్ల గణన ఘట్టం ముగియగా.. ఇప్పుడు వ్యక్తుల గణనకు ప్రభుత్వం సిద్ధమైంది. 2011 తర్వాత దాదాపు 16 ఏళ్ల విరామంతో జరుగుతున్న జనగణన–2027 రెండో విడతకు ప్రభుత్వం తేదీలను ప్రకటించింది. ఈ మేరకు జీఓ నంబర్‌ 155 ద్వారా చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌ జాజు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 24 వరకు ప్రజలకు స్వీయ గణనకు అవకాశం కల్పించనుండగా.. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి జనాభా వివరాలు సేకరించనున్నారు. మార్చి 1 నుంచి 5 వరకు సవరణల ప్రక్రియ చేపట్టనున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 38,20,369 ఉండగా, ఇందులో పట్టణ 28,28,036మంది, గ్రామీణ జనాభా 9,92,333 ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ విడతలో కుటుంబ సభ్యుల వివరాలు..

ఈ క్రమంలో 15 ఏళ్ల విరామం తరువాత జనగణనలో మొదటి విడతగా చేపట్టిన హౌస్‌లిస్టింగ్‌ అండ్‌ హౌసింగ్‌ సెన్సస్‌లో ఇళ్ల నిర్మాణం, నివాస పరిస్థితులు, కుటుంబాలకు ఉన్న సౌకర్యాల వివరాలను సేకరించారు. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలతోపాటు గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. ఇళ్ల రకం, గోడలు, పైకప్పుల నిర్మాణం, తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్డి, వంట ఇంధనం, ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్‌, వాహనాలు తదితర వివరాలను డిజిటల్‌ విధానంలో నమోదు చేశారు. రెండో విడతలో కుటుంబ సభ్యుల సంఖ్య, వయసు, లింగం, విద్యార్హతలు, వైవాహిక స్థితి, వత్తి, ఉపాధి తదితర అంశాలపై సమాచారం సేకరిస్తారు. ఈసారి కుల గణనకు సంబంధించిన ప్రశ్నలు కూడా జనగణనలో భాగంగా ఉండనున్నాయి.

‘గ్రేటర్‌’జనాభాపై ఆసక్తి..

హనుమకొండ–వరంగల్‌–కాజీపేట ట్రైసిటీ ప్రాంతంలో గత పదహారేళ్లలో పట్టణీకరణ వేగంగా పెరిగింది. కొత్త కాలనీలు, విలీన గ్రామాలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు విస్తరించాయి. దీంతో ఇక్కడి జనాభా ఎంత పెరిగింది? ఏ ప్రాంతాల్లో ఎక్కువ కుటుంబాలు నివసిస్తున్నాయి? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. సుమారుగా 11 లక్షల వరకు ఉంటుందని అంచనా కాగా, తాజా గణాంకాలు వెలువడితే తాగునీరు, రహదారులు, డ్రెయినేజీ, పారిశుద్ధ్యం, ప్రజా రవాణా, విద్య, వైద్య సదుపాయాల భవిష్యత్‌ ప్రణాళికలకు ఉపయోగపడనున్నాయి. కాగా జనాభా గణనకు 2027, మార్చి 1వ తేదీ అర్ధరాత్రి 00:00 గంటలను ప్రామాణిక సమయంగా నిర్ణయించారు. ప్రధాన గణన అనంతరం మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్‌ రౌండ్‌ నిర్వహించి వివరాల్లో పొరపాట్లు, మినహాయింపులను సరిచూడనున్నారు.

ఇళ్ల గణన పూర్తి..

వ్యక్తుల గణనకు వేళాయె..

2027, జనవరి 25 నుంచి

రెండో విడత ప్రారంభం

10 నుంచి 24 వరకు

స్వీయ గణనకు అవకాశం

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

గ్రేటర్‌ విస్తరణ..

కొత్త కాలనీల జనాభాపై ఆసక్తి

ప్రజలకు జనవరి 10 నుంచి 24 వరకు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. అనంతరం ఎన్యుమరేటర్‌ ఇంటికి వచ్చినప్పుడు నమోదు చేసిన వివరాలను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ సదుపాయాన్ని వినియోగించుకోని కుటుంబాల వివరాలను సిబ్బంది నేరుగా సేకరిస్తా రు. ఉమ్మడి జిల్లాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా గణన చేపట్టనున్నారు. కలెక్టర్ల పర్యవేక్షణలోసంబంధిత శాఖల సిబ్బందికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఉపాధ్యాయులు, ఇతర ప్రభు త్వ ఉద్యోగులను ఎన్యుమరేటర్లుగా నియమించి శిక్షణ ఇచ్చి, ‘గ్రేటర్‌ ’లో వార్డులు, కాలనీలవారీగా గణన చేయనున్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement