● జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో లక్ష్మీపూజలు
● పల్లెలు, పట్టణాల్లో బాణసంచా మోత
ములుగు: జిల్లా వ్యాప్తంగా వెలుగుల దీపావళి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించే దీపావళి వేడుకలు పల్లెలు, పట్టణాల్లో పండుగ శోభను సంతరించుకున్నాయి. పండుగ నేపథ్యంలో ఇళ్లను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు వాకిళ్లను మహిళలు రంగవల్లులతో అలంకరించారు. సాయంత్రం వేళ కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా దీపాలు వెలిగించి లక్ష్మీపూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులు, యువత బాణసంచా కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు.


