ములుగు: నూతన సమీకృత కలెక్టరేట్ భవనం, పైలాన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు మంత్రి సోమవారం నూతన కలెక్టరేట్ కార్యాలయం, గట్టమ్మ వద్ద నిర్మిస్తున్న పైలాన్ నిర్మాణ పనులను పరిశీలించారు. పైలాన్ నిర్మాణ పురోగతిని పరిశీలించిన మంత్రి సీతక్క, పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పార్కింగ్, విద్యుత్ సౌకర్యాలు, తాగునీటి ఏర్పాట్లు, పరిశుభ్రత తదితర అంశాలపై ఆరా తీశారు. సందర్శకులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ కృష్ణవేణి, ములుగు తహసీల్దార్ విజయభాస్కర్, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రానున్నందున జిల్లా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు తరలివచ్చి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో సోమవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొనే విధంగా నాయకులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
సమీకృత కలెక్టరేట్‌ను పరిశీలిస్తున్న సీతక్క
పైలాన్‌ను పరిశీలిస్తున్న మంత్రి సీతక్క, అధికారులు
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి,
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క


