ములుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో భాగంగా ములుగు నియోజకవర్గంలో ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 25 నుంచి 30వ తేదీ వరకు ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం జూలై 1 నుంచి ఆగష్టు 10వ తేదీ వరకు బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి వెళ్లి ఫారాలను అందజేశారని వివరించారు. ములుగు నియోజకవర్గంలో మొత్తం 2,36,970 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,09,128 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేసినట్లు వెల్లడించారు. ఇది మొత్తం ఓటర్లలో 88.25 శాతంగా ఉందని తెలిపారు. మిగిలిన 27,842 మంది ఓటర్లను ఆన్‌కలెక్టబుల్‌గా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిలో 8,354 మంది మరణించారని, 4,015 మంది డబుల్ ఎంట్రీలు ఉన్నాయని పేర్కొన్నారు. 14,207 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్లు, 1,219 మంది ఆచూకీ లభించని వారు ఉన్నట్లు వెల్లడించారు. డిజిటలైజేషన్ పూర్తయిన 88.25 శాతం, వివిధ కారణాలతో ఆన్‌కలెక్టబుల్‌గా గుర్తించిన 11.75 శాతం కలిపి జిల్లాలో నూటికి నూరుశాతం సర్ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. ఈ ప్రక్రియను విజయవంతం చేసిన ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలను కలెక్టర్ అభినందించారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు


