ఐటీడీఏ ముట్టడిని జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ ముట్టడిని జయప్రదం చేయాలి

Aug 12 2026 3:04 AM | Updated on Aug 12 2026 3:04 AM

మొదలైన మెడికో విద్యార్థిని ప్రీతి కేసు విచారణ ఉపాధ్యాయ సమస్యలపై పోరాటాలు

వెంకటాపురం(కె): ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని తుడందెబ్బ జాతీయ ఉపాధ్యక్షుడు యాసం రాజు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం గోండ్వానా సంక్షేమ పరిషత్‌, ఆదివాసీ నవనిర్మాణ సేన, తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం, తుడుం దెబ్బ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 17న తలపెట్టిన చలో ఐటీడీఏ ముట్టడి వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ చట్టాలైన 1/70 యాక్ట్‌, జీఓ నంబర్‌ 3ను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ హక్కు చట్టాలను అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రవన్‌కుమార్‌, సర్వేశ్వర్‌రావు, చిరంజీవి, భిక్షపతి, నరసింహమూర్తి, సాయి, రాంచందర్‌, సమ్మయ్య, సూర్యం తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ లీగల్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్‌ కాలేజీ (కేఎంసీ) విద్యార్థిని ప్రీతి హత్య కేసు విచారణ హనుమకొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రారంభమైంది. కేసు విచారణ షెడ్యూల్‌ మంగళవారం నుంచి ఐదు మాసాల వరకు నిర్ణయించారు. మొత్తం 99మంది సాక్షులను విచారించనున్నారు. మొదటి రోజు మృతురాలి తండ్రిని విచారించారు. 2023లో మృతి చెందిన మెడికో ప్రీతి హత్య విషయమై నాడు పీజీ విద్యార్థి అయిన మహ్మద్‌ షఫీని నిందితుడిగా భావించి కాలేజీ నుంచి తొలగించిన విషయం విదితమే. విచారణను ఎస్సీ, ఎస్టీ కోర్డు జడ్జి పద్మజ బుధవారానికి వాయిదా వేశారు.

విద్యారణ్యపురి: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటాలు చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యులు టి.లింగారెడ్డి, నన్నబోయిన తిరుపతి తెలిపారు. హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల యూఎస్సీఎస్‌ శాఖల దశలవారీ పోరాటాల సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12, 13 తేదీల్లో అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద, 19న జిల్లాకేంద్రంలో ధర్నాలు, 29న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పీఆర్‌సీని 2023నుంచి అమలు చేయాలని, సీపీస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్లతో ఆందోళలు చేపడతామని పేర్కొన్నారు. కమిటీ రాష్ట్ర బాధ్యులు రావుల రమేష్‌, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాల బాధ్యులు పెండెం రాజు, గొడిశాల సత్యనారాయణ, జి. ఉప్పలయ్య, కె.శ్రీనివాస్‌, బైరి స్వామి, భీమళ్ల సారయ్య, శ్రీనివాస్‌, డి.శ్రీరామ్‌, సూరయ్య, ఎ.మల్లయ్య, ఆర్‌.రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రూ.5కోట్లు మంజూరు

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం చండ్రుపల్లి–నాగేపల్లి గ్రామాల నడుమ వాగుపై ప్రతీ వర్షకాలంలో లో లెవల్‌ వంతెనతో వరదనీరు చేరి ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యం చండ్రుపల్లి వద్ద హై లెవల్‌ వంతెన నిర్మాణం కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హ్యామ్‌ నిధులు నుంచి రూ.5కోట్లు ఆర్‌అండ్‌బీ శాఖకు మంజూరు చేశారు. త్వరలో టెండర్‌ పూర్తయి నిర్మాణం జరుగుతుందని సోమవారం కాటారం పర్యటనలో మంత్రి పేర్కొన్నారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

విద్యారణ్యపురి: హనుమకొండలోని అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో హిందీ, పీఈటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12నుంచి 18వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటలవరకు అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement