ఏటూరునాగారం: మండల కేంద్రంలో ఇప్పటికే మాత శిశు సంరక్షణ కేంద్రం, రక్తనిధి కేంద్రంతో పాటు 30 పడకల ఆస్పత్రి ఉంది. ఏజెన్సీ ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందేలా ప్రభుత్వం మరో 50 పడకల ఆస్పత్రిని మంజూరు చేసింది. ఇటీవల రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ ద్వారా రూ.22కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులను కేవీఎన్‌రెడ్డి కన్‌స్ట్రక్షన్ వారు టెండర్ దక్కించుకున్నారు. జీప్లస్ 2 ఆస్పత్రి, స్టాఫ్ క్వార్టర్స్ సైతం నిర్మించడం వల్ల వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండడం వల్ల రోగులకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఇంజనీరింగ్‌శాఖ ద్వారా కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీని ప్రకారం పనులు సకాలంలో పూర్తి చేసి వైద్య సేవలకు అందుబాటులో తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్‌కుమార్, ఇంజనీరింగ్‌శాఖ ఏఈ నితీష్ తెలిపారు.
జనరల్ ఆస్పత్రికి కొత్త భవనం
ఏటూరునాగారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(ఏరియా)గా అప్‌గ్రేడ్ చేశారు. కొత్త భవనానికి అంకురార్పణ చేయడంతో ఏజెన్సీలోని గ్రామీణలకు మెరుగైన వైద్యం చేరువలోకి రానుంది. తెలంగాణ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ పనులను చేపట్టారు. ఇందులో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్, మందుల నిల్వల గిడ్డంగి, రోగుల వెయిటింగ్ హాల్, వైద్యుల గదులు, స్టాఫ్‌నర్సుల గదులతో పాటు జనరల్ వార్డును సైతం నిర్మించనున్నారు. తల్లిపాల ఫీడింగ్ రూంల ఏర్పాటుకూ ప్లాన్ రూపొందించారు. వాహనాల పార్కింగ్, అంబులెన్స్‌ల కారిడార్ కూడా అందుబాటులోకి రానుంది. ఇదేకాకుండా ఎమర్జెన్సీ వార్డును సైతం ఆధునికీకరణగా రూపొందించనున్నారు.
ఇప్పటికే ఉన్న సౌకర్యాలు
ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో ఇప్పటికే మెరుగైన సౌకర్యాలు ఉండగా అదనంగా 50 పడకల ఆస్పత్రి రావడం శుభసూచికమని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాతశిశు ఆస్పత్రి, డయాలసిస్ సెంటర్, రక్తదాన నిధి కేంద్రం ఉండడంతో పాటు ఆయుష్ హోమియోపతి ఆస్పత్రి కూడా అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, ఎస్‌ఎస్‌తాడ్వాయి, వెంకటాపురం(కె) ప్రాంతాల్లోని ప్రజలకు ఇక్కడ ఉచిత మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.
నిరుపయోగంగా ల్యాబొరేటరీ భవనం
తెలంగాణ హబ్ (ల్యాబొరేటరీ) భవనం నిరుపయోగంగా మారింది. రూ. 35లక్షలతో భవనం నిర్మించారు కానీ సౌకర్యాలు, మిషనరీలను సమకూర్చలేదు. దీంతో ల్యాబ్ భవనం నిరుపయోగంగా మారింది. ఈ భవనం కూడా రోగులకు అందుబాటులోకి వస్తే డెంగీ, మలేరియా, తదితర పరీక్షలను ఉచితంగా చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హబ్‌పేరుతో భవనానికి నిధులు కేటాయించినప్పటికీ మిషనరీలకు బడ్జెట్ కేటాయించకపోవడంతో ఇక్కడ ఎలాంటి పరికరాలను ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ భవనం నిరుపయోగంగా మారింది.
నిరుపయోగంగా ఉన్న తెలంగాణ హబ్(ల్యాబ్) భవనం
కొనసాగుతున్న జనరల్ ఆస్పత్రి భవనం పనులు
రూ. 22 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
18నెలల్లో పనులు పూర్తి చేయాలని ఒప్పందం


