టీవి నటి అంతరా బెనర్జీ రైలులో చేసిన హంగామా వివాదాస్పందంగా మారింది. అరావళి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో సీటు విషయంలో తలెత్తిన వివాదం ఆమె అరెక్టుకు దారితీసింది అని తెలిసింది. ఆర్‌పీఎఫ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాకుండా రేజర్ బ్లేడ్‌తో ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
రైల్వే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. షూటింగ్ నిమిత్తం సూరత్‌కు వెళ్తున్న అంతరా బెనర్జీ స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీ కోచ్‌లోకి ప్రవేశించారు. రిజర్వేషన్ ఉన్న ప్రయాణికుడి సీటులో కూర్చోవడంతో వివాదం ప్రారంభమైంది. సీటు ఖాళీ చేయాలని ఆర్‌పీఎఫ్ అధికారులు కోరినా ఆమె నిరాకరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు వెళ్లిన ఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ యామినీకాంత్ మిశ్రాతో ఆమె వాగ్వాదానికి దిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో రేజర్ బ్లేడ్‌తో ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మరుసటి రోజు ఆమెను బోరివలి రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
ఎవరీ అంతరా బెనర్జీ
కోల్‌కతాలో జన్మించిన అంతరా బెనర్జీ 2012లో టీవీ రంగంలోకి అడుగుపెట్టారు. ‘గుమ్రాహ్ ఎండ్ ఆఫ్ ఇన్నోసెన్స్’, ‘సావధాన్ ఇండియా’, ‘బడో బహు’, ‘లాల్ ఇష్క్’ వంటి సీరియల్లో నటించారు. ‘కసౌటీ జిందగీ కే సీరియల్’ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ‘రాగిణే ఎంఎంఎస్ రిటర్న్-2’ వెబ్ సిరీస్‌లోనూ నటించారు.


