‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సంయుక్తంగా విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి వారు శుభాకాంక్షలు తెలిపారు.
సినిమా కథాంశానికి అనుగుణంగా ‘ధర్మో రక్షతి రక్షితః’ పాటను రూపొందించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. పాట ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని పేర్కొంది. పాట విడుదల కార్యక్రమంలో చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట, నిర్మాత మెరుం భాస్కర్, సంగీత దర్శకుడు యేలెంధర్, సినిమాటోగ్రాఫర్ వెంకట్ హనుమతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. ‘‘మా సినిమా పాటను ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ప్రతి అడుగులోనూ చంద్రబోస్ గారు మాకు అండగా నిలుస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.
ఈ చిత్రంలో నటరాజ్, రాయంచ కొక్కుర, సుమన్, సాయికుమార్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, శివకుమార్ రామచంద్ర వారపు, వితిక షేరు, వరుణ్ సందేశ్, కస్తూరి, హారిక, కాలకేయ ప్రభాకర్, షఫీ, ఛత్రపతి శేఖర్, ఐ డ్రీమ్ అంజలి, సత్య ప్రకాశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


