విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. రాయలసీమలో బ్రిటీశ్ కాలంలో జరిగిన ఆకృత్యాల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. దాదాపు కోటిమందికి పైగా ఆకలి చావులతో చనిపోయారని.. ఆనాటి దారుణ పరిస్థితులను ఇందులో చూపించనున్నారు. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సంగతి పక్కనపెడితే తాజాగా రష్మిక, విజయ్ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ జంట తమ గొప్ప మనసును చాటుకున్నారు. ఏకంగా 400 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ కుటుంబాలకు మూడు నెలల పాటు సాయం చేస్తామని ప్రకటించారు. అన్నపూర్ణ పేరుతో 400 ఫ్యామిలీస్కు పౌష్టికహారం అందజేయనున్నట్లు రష్మిక వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
రష్మిక తన ఇన్స్టాలో రాస్తూ..'మీరు పోషించే పాత్రలలో మిమ్మల్ని ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉంటాయి.. మీలో చాలా మంది 'జయమ్మకి, నాకు మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా?' అని అడుగుతూ ఉంటారు. దానికి నా సమాధానం ఉంది. ఇది ఎల్లప్పుడూ నేనే, ఇది ఆమె కూడా.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ప్రతిఫలంగా నేను ఎప్పుడూ ఇలాంటివి చేస్తూనే ఉంటా.. కానీ ఎప్పుడూ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాను. ఎందుకంటే, నాకు, నా బృందానికి, మాలో కొందరికి తెలిస్తే చాలు అనుకున్నా. కానీ ఇప్పుడు నేను దీని గురించి బయటపెడుతున్నా.. ఎందుకంటే ఇది మిమ్మల్ని, నా ప్రియమైన వారిని, ఇలాంటిది ఏదైనా చేయడానికి ప్రభావితం చేయగలిగితే.. నేను చాలా సంతోషిస్తాను. నేను ఈ రోజు 400 కుటుంబాలను దత్తత తీసుకున్నా. ఒక్కో కుటుంబానికి 3 నెలల పాటు సహాయం చేయాలనుకుంటున్నా. రాబోయే ఒక సంవత్సరం పాటు దీనిని కొనసాగిస్తా. వారు ఆ డబ్బును నిత్యావసరాల కోసం ఆదా చేసి, దానిని తమ భవిష్యత్తును మెరుగ్గా ప్రణాళిక చేసుకోవడానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది.


