ప్రముఖుల ‘బయోపిక్స్‌’ | Upcoming Celebritys Biopics Movie Updates | Sakshi
Sakshi News home page

ప్రముఖుల ‘బయోపిక్స్‌’

Aug 10 2025 1:53 AM | Updated on Aug 10 2025 5:00 AM

Upcoming Celebritys Biopics Movie Updates

సిల్వర్ స్ర్కీన్ పై ప్రముఖులు జీవితలు

మిస్సైల్‌ మేన్‌ అబ్దుల్‌ కలామ్‌ జీవితం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ ధైర్య సాహసాలు చూడాలని ఎవరికి ఉండదు? ట్రాజెడీ క్వీన్‌ మీనా కుమారి జీవితం గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? కొందరు లెజెండ్స్‌ జీవితాలు అందరికీ ఆసక్తిదాయకంగానే ఉంటాయి. అందుకే వారి జీవితాలకు వెండితెర రూపం ఇస్తే... ఆ బయోపిక్‌కి ఉండే క్రేజే వేరు. ప్రస్తుతం బాలీవుడ్‌లో పలువురు లెజెండ్స్‌ జీవితాలతో సినిమాలు రూపొందుతున్నాయి. ఆ ప్రముఖుల ‘బయోపిక్స్‌’ గురించి తెలుసుకుందాం.

మిస్సైల్‌ మేన్‌లా... 
భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్‌ కలాం జీవితం ఆధారంగా ‘కలామ్‌’ చిత్రం రూపొందనుంది. ఈ మిస్సైల్‌ మేన్‌ పాత్రను ధనుష్‌ పోషించనున్నారు. ‘ఆది పురుష్‌’ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ని ఈ ఏడాది మేలో ఫ్రాన్స్‌లో జరిగిన కాన్స్‌ చలన చిత్రోత్సవాల్లో ఆవిష్కరించారు. ‘ది మిస్సైల్‌ మేన్‌ ఆఫ్‌ ఇండియా’ అనేది ‘కలాం’ సినిమా టైటిల్‌కి ట్యాగ్‌లైన్‌గా నిర్ణయించింది యూనిట్‌.

అభిషేక్‌ అగర్వాల్, అనిల్‌ సుంకర, భూషణ్‌కుమార్, క్రిషణ్‌ కుమార్, గుల్షన్‌ కుమార్, తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు అబ్దుల్‌ కలాం చేసిన సేవను ఈ చిత్రంలో చూపించనున్నారు. రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్‌ వరకు కలాం స్ఫూర్తిదాయక జీవితాన్ని ప్రపంచానికి చూపించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ని ఎప్పుడు ఆరంభిస్తారనేది తెలియాల్సి ఉంది.

యువర్‌ హానర్‌... 
లాయర్‌గా కోర్టులో ఎలా వాదించాలో శిక్షణ తీసుకుంటున్నారు రాజ్‌కుమార్‌ రావ్‌. ఎందుకంటే ‘యువర్‌ హానర్‌’ అంటూ అసలు సిసలైన లాయర్‌గా ఒదిగి పోవడానికి. భారతదేశ ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో రాజ్‌కుమార్‌ రావ్‌ నటించనున్నారు. ఉజ్వల్‌ నికమ్‌ కెరీర్‌లో అత్యంత కీలకమైన ముంబై 26/11 ఉగ్రవాద దాడుల్లో అజ్మల్‌ కసబ్‌పై జరిగిన విచారణ నేపథ్యంలో ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది.

అవినాష్‌ అరుణ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని దినేష్‌ విజన్‌ నిర్మించనున్నారు. ఎంతో పేరు, ప్రతిష్ఠలు ఉన్న ఉజ్వల్‌ నికమ్‌ పాత్రలో తన నటన గౌరవప్రదంగా ఉండటానికి రాజ్‌కుమార్‌ రావ్‌ ప్రత్యేకంగా వర్క్‌షాప్‌కి హాజౖరై, శిక్షణ తీసుకుంటున్నారట. ఈ చిత్రం షూటింగ్‌ని అక్టోబరులో   ఆరంభించాలనుకుంటున్నారు. ‘‘ఉజ్వల్‌ నికమ్‌లాంటి గౌరవప్రదమైన న్యాయవాదికి గొప్ప నివాళిగా ఈ చిత్రం ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు.  

మరాఠా యోధుడు శివాజీ జీవితంతో... 
డ్రీమ్‌ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు రితేష్‌ దేశ్‌ముఖ్‌. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని, శివాజీ పాత్రను తానే చేయాలనీ రితేష్‌కి కొంత కాలంగా ఉన్న కల. ఆ కల నెరవేర్చుకుంటున్నారు. ‘రాజా శివాజీ’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రితేష్‌ నటించడం మాత్రమే కాదు... దర్శకత్వం వహిస్తుండటం విశేషం. మూడు నాలుగు నెలల క్రితం విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి మంచి స్పందన లభించింది. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే 1న విడుదల చేయనున్నారు.

మరాఠీ, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఛత్రపతి శివాజీకి గొప్ప నివాళిగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సంజయ్‌ దత్, అభిషేక్‌ బచ్చన్, ఫర్దీన్‌ ఖాన్, భాగ్యశ్రీ... ఇలా భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదు...  లక్షలాది మంది హృదయాలలో నివసించే భావోద్వేగం. ఆయన అసాధారణ జీవిత కథలో ఒక భాగాన్ని చెప్పగలగడం గౌరవం, గొప్ప బాధ్యత’’ అని రితేష్‌ దేశ్‌ముఖ్‌ పేర్కొన్నారు.  

మేజర్‌ షైతాన్‌ సింగ్‌  
పరమ వీర చక్ర పురస్కారగ్రహీత మేజర్‌ షైతాన్‌ సింగ్‌గా ఒదిగి పోవడానికి ఓ నటుడిగా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు ఫర్హాన్‌ అక్తర్‌. ఎందుకంటే ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టంతో రూపొందిస్తున్న  ‘120 బహదూర్‌’లో షైతాన్‌ సింగ్‌ భాటీ పాత్ర పోషిస్తున్నారు ఫర్మాన్‌ అక్తర్‌. 1962లో ఇండియా–చైనాల మధ్య జరిగిన యుద్ధంలో ‘రెజాంగ్‌ లా’ పోరాట ఘట్టం ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు.

ఈ ఘటన ప్రధానాంశంగా రూపొందుతున్న చిత్రం ‘120 బహదూర్‌’. ఈ సినిమాలో ఇండియా–చైనా యుద్ధానికి నాయకత్వం వహించిన మేజర్‌ షైతాన్‌ సింగ్‌గా ఫర్హాన్‌ అక్తర్‌ నటిస్తున్నారు. రజనీష్‌ ఘాయ్‌ ఈ సినిమాకు దర్శకుడు. ‘‘ఇది మన సైనికుల వీరత్వం, ధైర్యాన్ని చాటి చెప్పే కథ’’ అని పేర్కొన్నారు ఫర్హాన్‌. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 21న రిలీజ్‌ చేయనున్నామని మేకర్స్‌ ప్రకటించారు.  

62 ఏళ్ల వయస్కురాలిగా యామీ 
62 ఏళ్ల వయసులో తనకు విడాకులు ఇచ్చిన భర్త నుంచి భరణం కోరుకుంటుంది షా బానో. అయితే అతను ససేమిరా అంటాడు. చేసేదేం లేక ఈ మహిళ కోర్టు మెట్లు ఎక్కుతుంది. భరణం కోసం న్యాయ పోరాటం చేస్తుంది. 1985లో జరిగిన ఈ కేసు ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుపర్ణ్‌ ఎస్‌. వర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో 62 ఏళ్ల వృద్ధురాలు షా బానో పాత్రను యామీ గౌతమ్‌ చేశారు.

ఆమె భర్త అహ్మద్‌ ఖాన్‌ పాత్రను ఇమ్రాన్‌ హష్మీ పోషించారు. ఈ పాత్ర యామీకి ఓ సవాల్‌ లాంటిది. ఎందుకంటే మూడు పదుల వయసులో ఉన్న యామీ అంతకు రెండింతలు వయసు ఉన్న మహిళగా ఒదిగి పోవడం అంటే ఫిజికల్‌గా చాలా ట్రాన్స్‌ఫార్మ్‌ కావాలి... అలాగే  ప్రోస్థెటిక్‌ మేకప్‌కి ఎక్కువ సమయం కేటాయించారు. నటనపరంగా కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరులో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

ఆపరేషన్‌ ఖుక్రి 
యునైటెడ్‌ పీస్‌ కీపింగ్‌ మిషన్‌లో భాగంగా వెస్ట్‌ ఆఫ్రికాకి వెళ్లిన 233 మంది భారతీయ సైనికులు అక్కడి రెబల్‌ ఫోర్స్‌ ట్రాప్‌లో చిక్కుకుంటారు. ఆ తర్వాత 75 రోజుల పాటు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ సైనికుల రెస్క్యూ ఆపరేషన్‌ని రాజ్‌పాల్‌ పునియా లీడ్‌ చేశారు. 2000లో ఈ ఆపరేషన్‌ జరిగింది. ఈ ఆపరేషన్‌ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఆపరేషన్‌ ఖుక్రి’. రాజ్‌పాల్‌ పునియా పాత్రను రణ్‌దీప్‌ హుడా  పోషిస్తున్నారు.

‘ఆపరేషన్‌ ఖుక్రి: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ ది ఇండియన్‌ ఆర్మీస్‌ బ్రేవెస్ట్‌ పీస్‌ కీపింగ్‌ మిషన్‌ అబ్రాడ్‌’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రణ్‌దీప్‌ హుడా ఓ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘‘నా హృదయాన్ని చాలా బలంగా తాకిన కథ ఇది’’ అని రణ్‌దీప్‌ ఇటీవల పేర్కొన్నారు.  అయితే ఈ చిత్రం ఆగిందనే టాక్‌ వినిపిస్తోంది. చిత్రదర్శకుడు అమిత్‌ శర్మ ఈ సినిమాని వదిలి, వేరే ప్రాజెక్ట్స్‌ చేపట్టడమే దీనికి కారణం అనే ప్రచారం జరుగుతోంది.

అగస్త్య నందాకి భలే చాన్స్‌ 
బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ మనవడు (అమితాబ్‌ కుమార్తె శ్వేత కుమారుడు) అగస్త్య నందాకి నటుడిగా రెండో సినిమాకే మంచి అవకాశం దక్కింది. ‘ఆర్చీస్‌’ (2023) చిత్రంతో నటుడిగా కెరీర్‌ ఆరంభించారు అగస్త్య. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇక రెండో చిత్రంగా ‘ఇక్కీస్‌’ చిత్రానికి అవకాశం వచ్చింది. 1971 భారత్‌–పాక్‌ యుద్ధంలో పోరాడిన భారతీయ సైనికుడు అరుణ్‌ ఖేత్రపాల్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

ఈ చిత్రంలో అరుణ్‌ ఖేత్రపాల్‌ పాత్రను అగస్త్య చేశారు. భారతదేశపు అతి పిన్న వయస్కుడైన పరమ వీర చక్ర పురస్కారగ్రహీత అరుణ్‌ ఖేత్రపాల్‌ శౌర్యం, త్యాగాన్ని ఆవిష్కరించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర కూడా నటించారు. ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. 
ఇవే కాదు... ఇంకొందరు ప్రముఖుల జీవితాలతో కొన్ని బయోపిక్స్‌ రూపొందుతున్నాయి.  – డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement