సినిమా వేడుకల్లో హీరోహీరోయిన్ల ప్రసంగాలు, దర్శక నిర్మాతల వ్యాఖ్యలు, ఆసక్తికర సంఘటనలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగింది?
వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. త్రివిక్రమ్‌కు నమస్కరించబోయింది. అయితే, అందుకు ప్రతిగా త్రివిక్రమ్ కూడా ముందుకు వంగి ఆమె పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించాడు.
సాధారణంగా సినిమా వేడుకల్లో సీనియర్ నటీనటులు, దర్శకులకు యువ నటీనటులు గౌరవ సూచకంగా నమస్కరించడం చూస్తుంటాం. కానీ, ఈ సందర్భంలో త్రివిక్రమ్ కూడా శ్రీనిధి శెట్టికి ప్రతిగా నమస్కరించేందుకు ప్రయత్నించడం ప్రత్యేకంగా నిలిచింది. దీంతో ఈ సంఘటనపై నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
(చదవండి: తొలి షో పడ్డ 'రామాయణ'.. ట్విటర్ టాక్ ఏంటి?)
ఈ ఘటనను కొందరు నెటిజన్లు పరస్పర గౌరవానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. ఎదుటివారు చూపించే గౌరవాన్ని తిరిగి అందించడం మంచి సంస్కారమని అభిప్రాయపడుతున్నారు. హోదా, వయసు, స్థాయితో సంబంధం లేకుండా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా పేరున్న త్రివిక్రమ్.. తనకంటే వయసులో చిన్నదైన హీరోయిన్‌కు అలా నమస్కరించేందుకు ప్రయత్నించడం అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా సీనియర్లకు జూనియర్లు గౌరవం ఇవ్వడం ఆనవాయితీగా ఉండే సినీ పరిశ్రమలో ఇలాంటి సంఘటన చర్చకు దారితీయడం సహజమేనని అంటున్నారు. మొత్తానికి ‘గురూజీ’ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఆదర్శ కుటుంబం సినిమా విషయానికొస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.
#AadarshaKutumbam ప్రి రిలీజ్ ఈవెంట్ లో తన పాదాలకు హీరోయిన్ శ్రీనిధి శెట్టి నమస్కారం చేయబోతుంటే ప్రతిగా తనూ వొంగి ఆమె కాళ్లకు నమస్కారం చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్. https://t.co/LjAbsOi0sw
— Journalist Yagna (@yagnamurthy) October 28, 2026


