
టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటించిన తాజా చిత్రం సుందరకాండ. ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్లో సుందరకాండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో నారా రోహిత్, మంచు మనోజ్ సందడి చేశారు. మొదటిసారిగా నారా రోహిత్ తన కాబోయే భార్య శిరీషాతో కలిసి ఈవెంట్కు హాజరయ్యారు. తొలిసారి ఈవెంట్లో కాబోయే టాలీవుడ్ జంట కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. ఈ ఏడాది భైరవం మూవీతో అలరించిన నారా రోహిత్ తనపెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించాడు. అయితే నారా రోహిత్, నటి శిరీషాల నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లో జరిగింది. త్వరలో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు (72) నవంబర్‌లో అకాల మరణం చెందడం వల్ల పెళ్లికి బ్రేకులు పడ్డాయి.
'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వారిద్దరు ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే.