ట్రోల్స్‌కి కాదేది అనర్హం అన్నట్లుగా మారిపోయింది నేటి సోషల్ మీడియా పరిస్థితి. ముఖ్యంగా సినీ తారల విషయంలో ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. వారి సినిమాలు, నటన మాత్రమే కాదు.. నడక, మాట తీరు, శరీరాకృతి, దుస్తులు ఇలా ప్రతీ విషయాన్నీ టార్గెట్ చేస్తూ బాడీ షేమింగ్‌కు దిగుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి నీనా గుప్తా కూడా ఇలాంటి ట్రోలింగ్‌కు గురయ్యారు. చీర కట్టుకున్న సమయంలో ఆమె పొట్ట కాస్త ఎక్కువ కనిపించడంతో గర్భవతి అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ ఘటనపై తాజాగా స్పందించిన నీనా గుప్తా.. ట్రోలర్స్‌కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
గర్భవతి అనే చెప్పమన్నా..
తాజాగా జాతీయ మీడియా సంస్థ సీఎన్‌ఎన్ న్యూస్ 18తో నీనా గుప్తా మాట్లాడుతూ.. బాడీ షేమింగ్‌పై స్పందించారు. ‘ట్రోలింగ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎలా ఉన్నా ట్రోలింగ్ చేస్తున్నారు. బాడీ షేమింగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆ మధ్య నేను చీరకట్టుకొని ఓ ఫంక్షన్‌కి వెళ్లా. చీర కాస్త బరువుగా ఉండడంతో సర్దుకునే క్రమంలో నా పొట్ట కాస్త లావుగా కనిపించింది. దాంతో 67 ఏళ్ల వయసులో గర్భవతి అయ్యారని ట్రోల్ చేశారు.
(ఇదీ చదవండి: రోజుకి రెండే చపాతీలు తింటా.. ఇదే నా డైట్)
బాడీ షేమింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇవన్నీ నా టీమ్ నా దగ్గరకు తీసుకోచ్చారు. చూసి నవ్వుకొని.. ‘నేను నిజంగానే ప్రెగ్నెంట్ అని చెప్పండి’ అని నా టీమ్‌కి చెప్పా. బాడీ షేమింగ్ ఎదుర్కొంటున్నవాళ్లకు నేను ఇచ్చే సలహా ఏంటంటే.. ‘లావుగా అయిందని అంటే.. ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పండి’ అని ఆమె అన్నారు. అలాగే ‘పెళ్లి ఎప్పుడు?’ అని వ్యక్తిగత ప్రశ్నలు అడిగే వారిని ఎలా ఎదుర్కొంటారని అడగ్గా.. ‘నేను మీపై ఆధారపడి బతకడం లేదు కదా? మీ సమస్య ఏంటి? ఇంతకీ మీకు పెళ్లి అయిందా? అని తిరిగి ప్రశ్నిస్తానని నీనా చెప్పుకొచ్చింది.
వెండితెర పైనే కాకుండా బుల్లితెర వేదిక గానూ ప్రేక్షకులను అలరించారు నటి నీనా గుప్తా. ‘ఇష్క్’, ‘ఎలోన్’, ‘ముల్క్’, ‘83’, ‘డయల్ 100’, ‘గుడ్‌బై’ వంటి చిత్రాల్లో నీనా కీలక పాత్రలు పోషించారు. సినిమాల్లో రాణిస్తోన్న తరుణంలోనే ఆమె ధారావాహికల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్‌సిరీస్‌లోనూ నటించారు. ఆమె నటించిన కామెడీ-డ్రామా సిరీస్ ' చుంబక్' సెప్టెంబర్ 11న విడుదలైంది.


