వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’(AK 47). శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్, నారా రోహిత్, నివేతా పేతురాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం ఇప్పటికే వెంకటేశ్ పాత్రను పరిచయం చేశారు. ఇందులో ఆయన చిట్టిబాబు అనే పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఇక తాజాగా శ్రీనిధి శెట్టి పాత్రను పరిచయం చేశారు.
‘ఇల్లాలే దేవత అని చెబుతూ.. ‘ఈ ఆడవాళ్లకి ఆటిట్యూడ్ తప్ప గ్రాటిట్యూడ్ ఉండదు బుజ్జిగారు. ఆదండి ఆడదంటే.. కనపడగానే పువ్వులాగా ఎలా నవ్వుతుందో చూడండి(పక్కింటి అమ్మాయిని చూపిస్తూ..). నా పెళ్లం ఉంది ఎందుకు..ఎప్పుడో పెళ్లి ఫోటోలో స్మైల్ ప్లీజ్ అంటే అప్పుడు నవ్వింది. మళ్లీ ఇప్పటిదాకా నవ్వలేదు. ఎప్పుడు మొహం ఇలా పెట్టుకుంటుంది’ అంటూ వెంకీ చెప్పే డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి. ఇందులో శ్రీనిధి..స్వర్ణగా నటిస్తోంది.
‘చిట్టిబాబుకు భార్యగా, చిరునవ్వే చిరునామాగా ఉండే ఓ ఆప్యాయమైన మధ్యతరగతి ఇల్లాలిగా ఆమె పాత్ర ప్రేక్షకుల హృదయాలను హత్తుకోనుంది. చిట్టిబాబు–స్వర్ణల మధ్య ఉండే అనుబంధం, చిలిపి సంభాషణలు, అనురాగం, కుటుంబ విలువలు సినిమాకు మరింత ఆత్మను, ఆహ్లాదాన్ని అందించనున్నాయి’ అని మేకర్స్ తెలిపారు.


