మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ కొణిదెల తన కష్టాలపై తొలిసారి పెదవి విప్పింది. చాలాకాలంపాటు తను అనుభవించిన బాధను బయటకు చెప్పుకుంది. ఎట్టకేలకు ఆ బాధ నుంచి బయటకు వచ్చేశానంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. "నాకే ఎందుకిలా జరుగుతోంది? ఎందుకింత బాధ అనుభవిస్తున్నాను? ఒకదాని వెంట మరొకటి వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయేంటి? నేనేం పాపం చేశానని ఇంత క్షోభ అనుభవిస్తున్నాను? అని చాలారోజులు నాలో నేనే మథనపడ్డాను.
ఆలోచనల్లో క్లారిటీ
నేను బాధితురాలిని అని బాధపడుతూ కూర్చున్న నేను నెమ్మదిగా ఆ భావన నుంచి బయటకు వచ్చాను. మన జీవితమేంటి.. ఇలా ఉంది! అని బాధపడటానికి బదులుగా దాన్ని మార్చుకునేందుకు ఏం చేయగలం? అని తెలుసుకోవడమే అసలైన మార్పు అని తెలుసుకున్నాను. 'సెల్ఫ్ మాస్టరీ ప్రాజెక్ట్' వల్ల నాలో ఆ మార్పు మొదలైంది. నా ఆలోచనల్లో క్లారిటీ వచ్చింది. జీవితం ప్రశాంతంగా మారింది. నేనేంటో తెలుసుకున్నాను.
తప్పు తెలుసుకున్నా..
ఒకప్పుడు నా లైఫ్‌లో జరిగిన తప్పులే నా గుర్తింపును నిర్ధారించాయనుకున్నాను. కానీ, అది తప్పని తెలుసుకున్నాను. బాధ నాలో ఒక భాగమే కానీ, అదే జీవితం కాదని తెలిసొచ్చింది. మనిషిలో ఇంకా ఎన్నో లేయర్స్ ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంటుంటే చాలా బాగుంది" అని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు గుండె లోతుల్లో బాధను అనుభవించిన తాను ఇప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నానంది. ఈ పోస్ట్‌కు నిహారిక కొణిదెల స్పందిస్తూ.. "మై సూపర్ ఉమెన్" అని కామెంట్ పెట్టింది.
పెళ్లి
శ్రీజ కొణిదెల 2007వ సంవత్సరంలో శిరీష్ భరద్వాజ్‌ను పెళ్లి చేసుకుంది. ఏడాది తిరిగేలోపు వీరికి కూతురు నివృతి జన్మించింది. కానీ కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2011లో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి పుట్టింటికి తిరిగొచ్చేసింది. 2014లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. 2016లో నటుడు కల్యాణ్ దేవ్‌ను రెండో పెళ్లి చేసుకుంది శ్రీజ. వీరికి 2018లో కూతురు నవిష్క జన్మించింది. కానీ ఈ దాంపత్య జీవితం కూడా ఎంతోకాలం సాగలేదు. 2022లో వీరు విడిపోయారు.


