హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన 'ది ఒడిస్సీ'.. ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తోంది. మన దేశంలోనూ మంచి టాక్ తెచ్చుకుని రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటేసింది. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడీ చిత్ర యూనిట్ అనుకోని ఓ వివాదంలో చిక్కుకుంది. షూటింగ్ కోసం ఉపయోగించిన ఓ వైకింగ్ నౌకని డ్యామేజీ చేయడంతో పాటు దానికి అయ్యే రిపేర్ ఖర్చులు ఇప్పటికీ చెల్లించలేదని నౌక యజమానులు ఆరోపిస్తున్నారు.
(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)
ది గార్డియన్ వెబ్ సైట్ చెప్పిన దాని ప్రకారం.. ఈ వివాదం 'గ్లాడ్ ఆవ్ గిల్‌బెర్గా' అనే వైకింగ్ లాంగ్‌షిప్ రెప్లికాకు సంబంధించినది. వైకింగాలెడెన్ అసోసియేషన్‌కు చెందిన ఈ నౌకని 'ది ఒడిస్సీ' మూవీలో ప్రాచీన గ్రీకు యుద్ధ నౌకగా ఉపయోగించారు. తమ నౌక, క్రిస్టోఫర్ నోలన్ సినిమాలో కనిపించబోతుందనే వార్తతో ఎంతో ఆనందించామని, కానీ షూటింగ్ తర్వాత దెబ్బతిన్న స్థితిలో ఉన్న నౌకను తమకు తిరిగి ఇచ్చారని, మరమ్మతులకు సుమారు 6,000 డాలర్లు(రూ.5.79 లక్షలు) ఖర్చయినా, నిర్మాణ సంస్థ యూనివర్సల్ పిక్చర్స్ ఇప్పటివరకు ఆ మొత్తాన్ని చెల్లించలేదని వైకింగా లెడెన్ అసోసియేషన్ చైర్మన్ పీటర్ ఒలౌసన్ అన్నారు.
మేం కార్మికుల ఖర్చు కూడా అడగడం లేదు. కేవలం మరమ్మతులకు ఉపయోగించిన సామగ్రి ఖర్చు మాత్రమే కోరుతున్నాం. యూనివర్సల్ పిక్చర్స్ లాంటి సంస్థకు 6,000 డాలర్లు పెద్ద మొత్తం కాదు. కానీ మమ్మల్ని పూర్తిగా మరిచిపోయినట్లు అనిపిస్తోందని పీటర్ పేర్కొన్నారు. షూటింగ్ మొదలవడానికి ముందే నౌకకు ఏమైనా నష్టం జరిగితే తామే మరమ్మతులు చేసి, తర్వాత ఆ ఖర్చును నిర్మాతలు తిరిగి చెల్లిస్తారని ఒప్పందం కుదిరిందని ఒలౌసన్ వెల్లడించారు. ఇప్పటికే నౌకకు మరమ్మతులు పూర్తి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చినా, ఏడాదికి అయిపోయినా తమకు చెల్లించాల్సిన డబ్బు అందలేదని అసోసియేషన్ వాదిస్తోంది.
అయితే ఈ ఆరోపణలను యూనివర్సల్ పిక్చర్స్ సంస్థ పూర్తిగా ఖండించింది. నౌకకు సంబంధించిన అన్ని బిల్లులు, మరమ్మతుల ఖర్చుతో సహా పూర్తిగా చెల్లించాం. ఏవైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు అసోసియేషన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం అని నిర్మాణ సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు. మరి ఇందులో ఎవరు నిజం చెబుతున్నారో ఏంటో?
(ఇదీ చదవండి: 'ఒడిస్సీ'లో చూపించినవి నిజమైన లొకేషన్లే.. ఏది ఎక్కడంటే?)


