ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయిపోయిన సినిమా 'ది ఒడిస్సీ'. హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఈ మూవీ గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఏకంగా రూ.2500 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అయితే మూవీ చూసిన చాలామంది.. దీనిని నిజమైన లొకేషన్లలో తీశారా? లేదంటే గ్రీన్/బ్లూ స్క్రీన్ ఉపయోగించారా అని అనుకుంటున్నారు. కానీ మీరు మూవీలో చూసిన లొకేషన్లన్నీ నిజమైనవే.
(ఇదీ చదవండి: క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ'.. ఎందుకు చూడాలి?)
నోలన్.. మూడు వేల ఏళ్ల క్రితం హోమర్ రాసిన గ్రీకు మైథాలజీ 'ఒడిస్సీ' అనే పుస్తకం ఆధారంగా సినిమా తీశాడు. అయితే గ్రీన్ స్క్రీన్, గ్రాఫిక్స్ ఉపయోగిస్తే అంత ప్రభావవంతంగా ఉండదనుకున్నాడో ఏమో గానీ గ్రీస్, ఇటలీ, స్కాట్లాండ్, ఐస్ లాండ్ లాంటి దేశాల్లో చిత్రీకరణ జరిపాడు.
సినిమాలో ట్రాయ్ యుద్ధం జరిగే లొకేషన్ మొరాకోలో ఉంది. అందులో గుర్రం, చిన్నపాటి భవంతులని సెట్స్ వేసి మిగిలినవి మాత్రం నిజమైన చోటు అయిన ఎట్ బెన్ హద్దు అనే ప్రదేశంలో చిత్రీకరించారు. అలానే ఒంటికన్ను రాక్షసుడు కనిపించే గుహ సీన్స్.. గ్రీస్‌లోని నెస్టర్ గుహలో తెరకెక్కించారు. ఇక ఒడిసియస్ రాజు ప్యాలెస్ సీన్లన్నీ ఇటలీలోని కాస్టలీ డీ శాంటా కేటరినా అనే కొండపై షూటింగ్ చేశారు.
ఇక పెద్ద పెద్ద మనుషులు కనిపించే సన్నివేశాన్ని స్కాట్లాండ్‌లోని సముద్రపు ఒడ్డున ఉన్న కల్బిన్ అడవిలో చిత్రీకరించారు. ఒడిసియస్ ప్రయాణిస్తున్న పడవ ఓ చోట సుడిగుండంలో చిక్కుకునేలా కనిపిస్తుంది. ఈ సీన్‌ని ఇటలీలోని ఫరగ్‌లియోనీ ది లిపారీ అనే చోట తీశారు. మూవీకి సంబంధించిన 23 నిమిషాల మేకింగ్ వీడియోని ఇప్పటికే హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. అది చూస్తే షూటింగ్ కోసం నోలన్ అంట్ టీమ్ ఎంతలా కష్టపడ్డారు? ఏయే లొకేషన్లలో సీన్స్ తీశారో చూడొచ్చు.
(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)







