‘ది ఒడిస్సీ’లో నటించనందుకు చాలా హ్యాపీగా ఉంది! | Oscar Winner Cillian Murphy Reveals Why Missing Nolan Latest Film Feels Like A Blessing, Says No Regrets Only Relief | Sakshi
Sakshi News home page

‘ది ఒడిస్సీ’లో నటించనందుకు చాలా హ్యాపీగా ఉంది!

Jul 18 2026 11:57 AM | Updated on Jul 18 2026 12:10 PM

No Regrets Only Relief: Cillian Murphy Reacts Missing Nolan The Odyssey

క్రిస్టోఫర్‌ నోలన్‌ దర్శకత్వంలో సినిమా అంటే ఏ నటుడైనా నటించాలని కోరుకుంటారు. కానీ నటుడు, ఆస్కార్‌ విన్నర్‌ సిలియన్‌ మర్ఫీ మాత్రం ఎలాంటి బాధ లేదని చెబుతున్నాడు. పైగా అలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని.. దానిని తానొక బహుమతిగా భావిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నోలన్‌ తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’ రిలీజ్‌ నేపథ్యంలో.. ఆయనతో చిరకాల అనుబంధం ఉన్న మర్ఫీ ఏమన్నాడంటే..

సిలియన్‌ మర్ఫీ, క్రిస్టోఫర్‌ నోలన్‌ కాంబినేషన్‌ హాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వీరి ప్రయాణం ‘బ్యాట్‌మ్యాన్‌ బిగిన్స్‌’ (2005)తో మొదలైంది. ఆ తర్వాత ‘ది డార్క్‌ నైట్‌’, ‘ఇన్‌సెప్షన్‌’, ‘డంకిర్క్‌’లోనూ మర్ఫీ నటించారు. ఇక.. 2023లో వచ్చిన ‘ఓపెన్‌హైమర్‌’లో శాస్త్రవేత్త జే. రాబర్ట్‌ ఓపెన్‌హైమర్‌ పాత్రలో మర్ఫీ అద్భుత నటనకు ఆస్కార్‌ ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఈ సినిమా నోలన్‌-మర్ఫీ భాగస్వామ్యానికి మరో మైలురాయిగా నిలిచింది.

నోలన్‌తో కలిసి ఇప్పటికే ఆరు సినిమాల్లో పనిచేసిన మర్ఫీ.. ‘ది ఒడిస్సీ’లో మాత్రం లేడు. అయితే నోలన్‌ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ను ఓ ప్రేక్షకుడిగా ఆస్వాదించడం తనకు ఆనందంగా ఉందన్నారు. సాధారణంగా ఇలాంటి అవకాశం కోల్పోతే వచ్చే ఫోమో (Fear Of Missing Out)కు బదులుగా తనకు ROMO (Relief Of Missing Out) అనిపించిందని సరదాగా వ్యాఖ్యానించాడాయన.

“క్రిస్‌ సినిమాలను చూస్తున్నప్పుడు నా సొంత ముఖాన్ని తెరపై చూడాల్సిన భారం లేకుండా ఆస్వాదించడం ఓ గొప్ప అనుభూతి” అంటూ మర్ఫీ నవ్వుతూ చెప్పారు. నోలన్‌తో తన కెరీర్‌లో ఎన్నో గొప్ప చిత్రాలు చేసిన మర్ఫీ.. ఈసారి తెరపై కనిపించకుండా, ప్రేక్షకుడిగా ఆ సినిమాను ఆస్వాదించడమే తనకు ప్రత్యేక అనుభూతి అని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

భారీ అంచనాల మధ్య ‘ది ఒడిస్సీ’
హోమర్‌ రచించిన ప్రపంచ ప్రసిద్ధ గ్రీకు ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ‘ది ఒడిస్సీ’లో మ్యాట్‌ డామన్‌ ఒడిస్సియస్‌ పాత్రలో నటించారు. అన్నే హాత్‌వే, టామ్‌ హాలండ్‌, జెండయా, రాబర్ట్‌ ప్యాటిన్సన్‌ కీలక పాత్రల్లో కనిపించారు. ట్రాయ్‌ యుద్ధం తర్వాత స్వదేశం ఇథాకాకు చేరుకునేందుకు ఒడిస్సియస్‌ చేసిన పదేళ్ల సాహస ప్రయాణమే ఈ కథకు ప్రధాన నేపథ్యం. అలాగే ఐమ్యాక్స్‌ స్క్రీనింగ్‌ ఈ సినిమాకు మరో ప్రత్యేకతను తెచ్చి పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement