భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా దక్షిణాది సినిమాకు సరికొత్త వ్యాకరణాన్ని నేర్పిన దర్శక శిఖరం భారతీరాజా. అప్పటివరకు నాలుగు గోడల మధ్య స్టూడియో సెట్లలోనే సాగుతున్న సినిమాను, పచ్చని పల్లెటూరి పొలాల్లోకి, మట్టి రోడ్ల పైకి తీసుకెళ్లిన ఘనత ఆయనది. అందుకే ఆయన్ని తమిళ చిత్రసీమ ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం) అని ఎంతో గౌరవంగా పిలుచుకుంటుంది. నేడు(జూన్ 10) ఆయన మనకు భౌతికంగా దూరమయ్యాడు. గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకతలు ఏంటి? ఆయన సినీ ప్రస్థానం ఎలా సాగింది? ఓ సారి చూద్దాం.
తొలి చిత్రంతోనే సంచలనం
1941 జూలై 17న మదురై (తేని) జిల్లాలో జన్మించిన భారతీరాజా, 1977లో '16 వయదినిలే' (తెలుగులో 'పదహారేళ్ల వయసు') సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. స్టూడియో సెట్టింగుల యుగానికి స్వస్తి చెప్పి, అవుట్‌డోర్ షూటింగ్‌లకు ఈ సినిమాతోనే ఆయన శ్రీకారం చుట్టారు.
తెలుగులోనూ చెరగని ముద్ర
ఆయన తమిళంలో తీసిన ఎన్నో క్లాసిక్ సినిమాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి. మరికొన్ని రీమేక్ రూపంలో వచ్చి ఇక్కడి ప్రేక్షకులను కూడా అలరించాయి. నేరుగా తెలుగులో ఆయన చేసిన 'సీతాకోకచిలుక' (1981) సినిమా ఇండస్ట్రీ హిట్ కావడమే కాకుండా నేటికీ ఒక అద్భుత ప్రేమకావ్యంగా నిలిచిపోయింది. ‘ఆరాధన’, ‘జమ్మిచెట్టు’ వంటి చిత్రాలు కూడా ఆయన సృజనాత్మకతకు అద్దం పడతాయి. కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ ఆయన ప్రత్యకతను చాటుకున్నాడు. ‘ఆయుత ఎళుతు’ (యువ), ‘పాండియనాడు’, ‘తిరుచిత్రంబలమ్’ (తిరు), ఆ మధ్య వచ్చిన విజయ్ సేతుపతి ‘మహారాజా’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. మోహన్‌లాల్ ‘తుడరుమ్’లో చివరిసారి తెరపై కనిపించారు. అలాగే ఆయన నటించిన ‘పులవర్’ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది.
'R' సెంటిమెంట్
భారతీరాజా సినిమాల ద్వారా పరిచయమైన ఎందరో కథానాయికలు స్టార్ హీరోయిన్లుగా వెలిగారు. ముఖ్యంగా ఆయన పరిచయం చేసే హీరోయిన్ల పేర్లు 'R' అక్షరంతో (రాధిక, రాధ, రేవతి, రంజని, రేఖ) ప్రారంభం కావడం ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్‌గా నిలిచింది.
ఆమెతో ప్రేమలో..
పల్లెటూరి సంస్కృతిని, అక్కడి మనుషుల భావోద్వేగాలను, కుల వ్యవస్థలోని సంక్లిష్టతలను అత్యంత సహజంగా తెరకెక్కించడంలో భారతీరాజా సిద్ధహస్తుడు. హీరోయిన్లకు మేకప్ లేకుండా తెరపై చాలా సహజంగా చూపించేవాడు. దీనికి గల కారణాన్ని కూడా ఒక సందర్భంలో ఆయన వివరించాడు. ‘నేను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డా. ఆమెను వెతుక్కుంటూ వెళ్తుటా. ఆశ్చర్యంగా ప్రతిసారి ఆమె నాకు పల్లెటూరిలోనే కనిపిస్తుంది. చాలా అందంగానూ ఉంటుంది. ఆమె ఎవరో కాదు ‘ప్రకృతికాంత’. ఆమె అందానికి నేను ఫిదా అయ్యాను. అందుకే కెమెరా పట్టుకొని ఆ అందాన్ని వెతుక్కుంటా’ అంటూ పల్లెటూరిపై తనకున్న ప్రేమను చతురతను జోడించి తనదైన శైలీలో చెప్పుకొచ్చాడు.
అవార్డులు - పురస్కారాలు
పద్మశ్రీ పురస్కారం: భారతీరాజా సాధించిన విజయాలకు గుర్తింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అత్యున్నత పురస్కారాలతో ఆయన్ను సత్కరించాయి.చలనచిత్ర రంగానికి చేసిన విశేష సేవలకు గానూ 2004లో కేంద్ర ప్రభుత్వం ప్రద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.
జాతీయ చలనచిత్ర అవార్డులు: ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం, తెలుగు), సామాజిక అంశాలపై ఉత్తమ చిత్రం విభాగాల్లో కలిపి మొత్తం 6 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.
నంది అవార్డు: 'సీతాకోకచిలుక' చిత్రానికి గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ దర్శకుడిగా 'నంది' పురస్కారాన్ని అందుకున్నారు. ఇతర పురస్కారాలుదక్షిణ భారత ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (4), తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను (6) సొంతం చేసుకున్నారు.


