
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan).. తమిళ స్టార్ కమల్ హాసన్ కాలి మట్టితో కూడా సరిపోడంటున్నాడు బాలీవుడ్ నటుడు లిల్లీపుట్. షారూఖ్ మరుగుజ్జుగా నటించిన జీరో మూవీ (2018) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. దీంతో అతడు కొంతకాలం పాటు యాక్టింగ్‌కు బ్రేక్ తీసుకున్నాడు. షారూఖ్ కంటే ముందు కమల్ హాసన్ 1989లో అపూర్వ సగోదరర్గల్ (తెలుగులో విచిత్ర సోదరులు) మూవీలో మరుగుజ్జుగా నటించి సూపర్ హిట్టందుకున్నాడు.
మరుగుజ్జుగా నటించడం కష్టం
ఈ రెండు సినిమాలను పోలుస్తూ నటుడు లిల్లీపుట్ (Lilliput) సంచలన వ్యాఖ్యలు చేశాడు. కళ్లున్నా సరే అంధుడిగా నటించవచ్చు. కానీ మంచి ఎత్తు ఉన్నప్పటికీ మరుగుజ్జుగా నటించడమంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్లు అందరిలాగే మామూలుగానే ఉంటారు. అందరిలాగే నవ్వుతారు, అందరిలాగే ఆలోచిస్తారు. కానీ చూడటానికి మాత్రం కాస్త విచిత్రంగా కనిపిస్తుంటారు. దాన్ని తెరపై చూపించాలి. కాబట్టి మరుగుజ్జుగా కనిపించడమనేది కష్టమైన పని.
ప్రతీది నిశితంగా గమనించి..
కానీ కమల్ హాసన్ ఏం చేశాడు? మరుగుజ్జులు ఎలా ఉంటారు? అనేది ప్రతీది వివరంగా తెలుసుకున్నాడు. వారి చేతి వేళ్లు చిన్నగా, మందంగా ఉంటాయని గమనించాడు. ముఖం, మోచేతులు, పాదాలు కాస్త భిన్నంగా ఉంటాయని తెలుసుకున్నాడు. ఇవన్నీ గమనించకుండా యాక్ట్ చేస్తే అందులో కొత్తదనం ఏముంటుంది? పోషించే పాత్రను ప్రభావవంతంగా చూపించాలిగా! కమల్ అదే చేశాడు. వీఎఫ్‌ఎక్స్ వాడకుండా రియల్‌గా కనిపించాడు.
కమల్‌ను కాపీ కొట్టావ్
నువ్వు (షారూఖ్) వీఎఫ్‌ఎక్స్ సాయంతో పొట్టిగా కనిపించావు. కమల్‌ను కాపీ కొట్టావు. తనలాగే హావభావాలు ప్రదర్శించేందుకు ట్రై చేశావు. అయినప్పటికీ ఆయన కాలికి ఉన్న మట్టితో కూడా నువ్వు సమానం కాదు అని చెప్పుకొచ్చాడు. కాగా షారూఖ్ ఇటీవలే.. జవాన్ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. ప్రస్తుతం షారూఖ్.. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో కింగ్ సినిమా చేస్తున్నాడు. ఇందులో షారూఖ్ కూతురు సుహానా కూడా నటిస్తోంది. అభయ్ వర్మ, అభిషేక్ బ్చన్, జైదీప్ అహ్లావత్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మిని ఆటాడుకున్న అల్లు అర్హ