'రావు బహదూర్' సినిమా రివ్యూ | Rao Bahadur Review Telugu And Rating | Sakshi
Sakshi News home page

Rao Bahadur Review: 'రావు బహదూర్' ఎలా ఉంది? హిట్టా ఫట్టా?

Jul 3 2026 1:11 PM | Updated on Jul 3 2026 5:51 PM

Rao Bahadur Review Telugu And Rating

'వారణాసి'తో బిజీగా ఉన్న మహేశ్ బాబు.. ఓ నిర్మాతగా చేసిన సినిమా 'రావు బహదూర్'. సత్యదేవ్ హీరోగా నటించగా.. 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వం వహించాడు. ప్రమోషన్లు, సత్యదేవ్ లుక్స్ కారణంగా ఈ చిత్రంపై కాస్తంత బజ్ ఏర్పడింది. అలా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ‘నాగబంధం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

కథేంటి?
అది 1991. భువన వంశానికి చెందిన రామప్పరావు బహదూర్ అలియాస్ రాముడు(సత్యదేవ్) లివర్ క్యాన్సర్ బారిన పడతాడు. నాలుగు నెలలకు మించి బతకడని ఓ డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు గానీ ఏడాది దాటిపోయినా సరే రామప్ప అలానే ఉంటాడు. పైపెచ్చు రోజూ తాగుతూ బతికేస్తుంటాడు. నిద్రలో నుంచి లేచి అ‍ప్పుడప్పుడు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఇలా జరగడానికి కారణం ఎప్పుడో చనిపోయిన రామప్ప చిన్న కొడుకు కుసుమప్ప. వీడు తనకు పుట్టలేదని రామప్ప 'అనుమానం'. ఇదే విషయాన్ని చెబుతూ తన స్నేహితుడు, డాక్టర్ ఆచారి(వికాస్ ముప్పల) బుర్ర తినేస్తూ ఉంటాడు. మరి రావు బహదూర్ అనుమానం నిజమేనా? కుసుమప్ప ఎందుకు ఎలా చనిపోయాడు? ఈ కథలో రామప్ప భార్య రేణుక (దీపా థామస్) సంగతేంటి? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఎలాంటి కథ తీసుకున్నా చివరకు ఎలాంటి ట్విస్టులు పెట్టినా ప్రెజెంటేషన్ ఎలా ఉందనేది కూడా కీలకం. ఎందుకంటే అద్భుతమైన ట్విస్టులు పెట్టినా సరే దానికి తగ్గ కథకథానాలు లేదంటే క్లైమాక్స్‌లో పెద్దగా ఇంపాక్ట్ అనిపించదు. 'రావు బహదూర్' విషయంలో సరిగ్గా అదే జరిగింది. తెర నిండా భారీతనం, సత్యదేవ్ చేసే డిఫరెంట్ యాక్టింగ్ బాగున్నప్పటికీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా లేకపోవడం దీనికి పెద్ద మైనస్.

ఓ ఫొటో ఫ్రేమ్ నుంచి బయటకొచ్చిన ఓ పిల్లాడు వేగంగా పరుగెత్తే సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. తర్వాత కాసేపటికే ప్రధాన పాత్రధారి రావు బహదూర్ ఎంటర్ అవుతాడు. ఇంతకీ అతడెవరు? అతడి ప్రపంచం ఏంటి? అని మెల్లగా చూపిస్తూ వెళ్తారు. తన జీవితాన్ని చెబితే రెండు భాగాల సినిమా అవుతుందని కూడా అంటాడు. కట్ చేస్తే రామప్ప యుక్త వయసుకి కథ వెళ్తుంది. దేశాలు పట్టుకు తిరుగుతున్న రామప్ప.. తండ్రి అనారోగ్యం కారణంగా ఇంటికి వస్తాడు. అదే టైంలో తండ్రిని చూసుకోవడానికి వచ్చిన నర్స్ రేణుకతో ప్రేమలో పడతాడు. తర్వాత వీళ్ల పెళ్లి, వైవాహిక జీవితం ఎలా సాగింది? రావు బహదూర్‌కి వచ్చిన అనుమానం.. పెనుభూతంలా మారి అతడి జీవితాన్ని ఎలా నాశనం చేసిందనేది మిగతా స్టోరీ.

ఫస్టాప్ చాలా అంటే చాలా నెమ్మదిగా నిదానంగా సాగుతూ ఉంటుంది. డ్రామా మరీ ఎక్కువైపోయింది. ఏదో జరుగుతుంది అని తెలుస్తూ ఉంటుంది గానీ అసలు సంగతి ఏంటనేది మాత్రం అంతుపట్టదు. చెప్పాలంటే సహనాన్ని చాలా పరీక్షిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి ఫస్టాప్‌తో పోలిస్తే కాస్త బెటర్ అనిపిస్తుంది. సెటైరికల్ కామెడీ కొన్నిచోట్ల వర్కౌట్ కూడా అయింది. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు? ఏం చూపించాలనుకున్నాడో ఇంటర్వెల్ తర్వాతే తెలుస్తుంది. చివరికొచ్చేసరికి ఊహించని ట్విస్టులతో ముగుస్తుంది.

అయితే ఇదే దర్శకుడు గతంలో 'కేరాఫ్ కంచరపాలెం' తీశాడు. ఇందులో సినిమా అంతా సరదసరదాగా ఉంటూ చివరలో షాకిచ్చే ట్విస్ట్ వస్తుంది. ఇందులో కూడా అదే పద్ధతి ఫాలో అయ్యారు. కాకపోతే క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా గానీ అప్పటివరకు ఉంటే స్టోరీ అంతా సోసోగా ఉంటుంది. పెద్దగా ఎంటర్‌టైన్ చేయదు. నిడివి కూడా చాలా ఎక్కువ. పేరుకే 2 గంటల 50 నిమిషాల నిడివి కానీ ఏదో నాలుగైదు గంటల మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ లాంటివి బాగున్నప్పటికీ ఎమోషన్ సరిగా పండకపోవడం పెద్ద మైనస్. రావు బహదూర్ పాత్రతో పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేకపోతాం.

అయితే ఈ మూవీలో ఏదైనా మెచ్చుకోవాల్సిన విషయం ఉందంటే అది సత్యదేవ్ నటన. ఎందుకంటే చూస్తున్నంతసేపు రావు బహదూర్ పాత్రకు జీవం పోశాడా అనిపిస్తుంది. చిత్రమైన హావభావాలు, అప్పటికప్పుడు మార్చే ఎమోషన్స్ వెరైటీగా అనిపిస్తాయి. ఇతడి ఇంట్లో పనిమనిషిగా చేసిన మహిళ పాత్ర నవ్విస్తుంది. ఫ్రెండ్ ఆచారిగా చేసిన వికాస్ ముప్పల ఆక‍ట్టుకున్నారు. రావు బహదూర్ భార్య రేణుకగా చేసిన దీపా థామస్.. ఫస్టాప్‌లో కనిపిస్తుంది. ఇంప్రెసివ్‌గాా అనిపిస్తుంది. కానీ మళ్లీ క్లైమాక్స్‌లో దర్శనమిస్తుంది. మధ్యలో అస్సలు కనిపించదు.

ఇక రైటర్, డైరెక్టర్ వెంకటేశ్ మహా విషయానికొస్తే.. తెలుగులో ఇప్పటివరకు రానటువంటి డిఫరెంట్ యాక్టింగ్, విజువల్‌తో మెస్మరైజ్ చేద్దామనుకున్నాడు. అందుకు తగ్గట్లే చాలానే కష్టపడ్డాడు కూడా. కానీ ఎందుకనో అది పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదనిపించింది. ఇందులో రావు బహదూర్ ముత్తాత తాతకు తాత పాత్రలో వెంకటేశ్ మహా.. చిన్నపాటి అతిథి పాత్రలోనూ కనిపిస్తాడు. స్టెప్పులు కూడా వేస్తాడు. ఓవరాల్‌గా చూసుకుంటే 'రావు బహదూర్' చాలా కష్టపడి తీసిన సినిమా, కాకపోతే 'ఓకే' అనిపించే దగ్గరే ఆగిపోయింది.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: ఓటీటీలో కామెడీ సిరీస్.. 'సూపర్ సుబ్బు' రివ్యూ)

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement