యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పెంపుడు కుక్క ‘భగీర’ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన జీవితంలో భగీరతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ‘భగీర.. నువ్వు నా జీవితంలోకి పెంపుడు శునకంలా వచ్చావు. కొంత కాలంలోనే మా కుటుంబ సభ్యుడిగా మారిపోయావు. ప్రేమ, విశ్వాసం, అల్లరితో ప్రతి రోజూ నా అలసటను దూరం చేశావు. ఇప్పుడు చెప్పలేని బాధను మిగిల్చి వెళ్లావు. నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతో ఉంటాయి’ అంటూ భగీరకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
ఎన్టీఆర్ మాటలను బట్టి చూస్తే భగీర ఆయన కుటుంబంలో ఎంతటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందో అర్థమవుతోంది. షూటింగులు, ఇతర పనులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటికి చేరుకున్న తర్వాత పెంపుడు జంతువులతో సమయం గడపడం ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టమట. ముఖ్యంగా భగీరతో ఆయనకు మంచి అనుబంధం ఉండేదట.అందుకే భగీరను కోల్పోవడం ఎన్టీఆర్‌కు తీవ్ర భావోద్వేగాన్ని కలిగించింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టొచ్చని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో ఆయన కొంతకాలం షూటింగులకు దూరంగా ఉండనున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలో విడుదల కానుంది.


