రామ్‌ పోతినేని పెద్ద మనసు.. శశిభవ్యతతో వీడియో కాల్‌ | Ram Pothineni Has Extended Financial Support To His Fan Shashi Bhavyatha | Sakshi
Sakshi News home page

రామ్‌ పోతినేని పెద్ద మనసు.. శశిభవ్యతతో వీడియో కాల్‌

Aug 19 2026 5:59 PM | Updated on Aug 19 2026 6:14 PM

Ram Pothineni Has Extended Financial Support To His Fan Shashi Bhavyatha

హీరో రామ్‌ మరోసారి తన పెద్ద మనసుని చాటుకున్నాడు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల శశిభవ్యతకు అండగా నిలిచారు. తన అభిమాన నటుడు రామ్‌ పేరు చెబితేనే ఉత్సాహంగా స్పందించే శశిభవ్యత పరిస్థితిపై మీడియాలో వచ్చిన కథనాలను తెలుసుకున్న ఆయన.. వెంటనే స్పందించారు. బుధవారం స్వయంగా శశిభవ్యతతో వీడియో కాల్‌లో మాట్లాడి ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా ఆమెకు అవసరమైన మందులు, ఇతర వైద్య ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

దుప్పలపూడి గ్రామానికి చెందిన సలాది శ్రీను, శ్రీదుర్గ దంపతుల కుమార్తె శశిభవ్యత. మూడు తరాలుగా కుటుంబంలో మేనరికపు వివాహాలు జరగడంతో ఆమె ‘లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ’ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి బారిన పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా శశిభవ్యకు తరచూ ఫిట్స్‌ రావడంతో పాటు నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. రోజువారీ పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉండటంతో తల్లిదండ్రులే ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.

శశిభవ్యతకు మతిస్థిమితం సరిగా లేకపోయినా హీరో రామ్‌ పోతినేని అంటే ఎంతో ఇష్టం. ఆయన పేరు చెబితేనే ఆమెలో ఉత్సాహం కనిపిస్తుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు రామ్‌ సినిమాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను ఆమెకు చూపిస్తూ అన్నం తినిపించడం, మందులు వేయించడం చేస్తున్నారు.

ఈ విషయం మీడియా, సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో రామ్‌ పోతినేని దృష్టికి కూడా వెళ్లింది. శశిభవ్యత పరిస్థితిని తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడారు.

వీడియో కాల్‌ సందర్భంగా శశిభవ్యత తల్లిదండ్రులతో రామ్‌ మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పడంతో పాటు శశిభవ్యతకు సంబంధించిన వైద్య రిపోర్టులు తనకు అందాయని తెలిపారు. ఇకపై ఆమెకు అవసరమైన మందులు, ఇతర వైద్య ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

శశిభవ్యను సంతోషంగా ఉంచాలని, వైద్యులు సూచించిన విధంగా సరైన సమయానికి మందులు అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అవసరమైన సహాయం అందించేందుకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఏడాదిగా మందుల ఖర్చులు భరిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు
మరోవైపు శశిభవ్యత కుటుంబానికి ఇప్పటికే కొంతకాలంగా స్థానికంగా సహాయం అందుతోంది. వైఎస్సార్సీపీ నాయకుడు రామ సతీష్‌ గత ఏడాది కాలంగా శశిభవ్యకు అవసరమైన మందుల ఖర్చులను భరిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని నిరంతరం మందుల కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న శశిభవ్యకు ఒకవైపు స్థానికంగా రామ సతీష్‌ నుంచి ఏడాదిగా సహాయం అందుతుండగా.. మరోవైపు తన అభిమాన హీరో రామ్‌ పోతినేని స్వయంగా స్పందించి భరోసా ఇవ్వడం కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement