
‘‘ఒక భారీ అగ్ని ఎగిసే క్షణం ఆసన్నమైంది... కొందరు అపరిచితుల గురించి తెలియని వాస్తవ కథను వెలికి తీద్దాం’’ అంటూ హిందీ చిత్రం ‘ధురంధర్’లోని తన పోస్టర్‌ని, టీజర్‌ని షేర్ చేశారు హీరో రణ్‌వీర్ సింగ్. ఆదివారం (జూలై 6) రణ్‌వీర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్, టీజర్‌ని విడుదల చేసి, ఈ సినిమాని డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. టీజర్‌లో రణ్‌వీర్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించారు.
థ్రిల్, వయొలెన్స్, మిస్టరీలతో ఈ టీజర్ సాగుతుంది, ‘ధురంధర్’లో సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రామ్‌పాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడిగా తొలి చిత్రం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ (2019)తో జాతీయ అవార్డు సాధించిన ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని భారత నిఘా, శాంతి భద్రతల మాజీ అధికారి, ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో బీ62 స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిత్రదర్శకుడు ఆదిత్య ధర్ ఓ నిర్మాత కాగా, జ్యోతీ దేశ్‌పాండే సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.